
- ఇది చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు వేదిక
- విద్యాభివృద్ధికి ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయం
- ఎగ్జిబిషన్ ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
- ఈసారి 17లక్షల64వేల313 మంది సందర్శించారని వెల్లడి
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న నుమాయిష్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీధర్‌బాబు పాల్గొని మాట్లాడారు. ఈసారి 17 లక్షల 46 వేల 313 మంది నుమాయిష్‌ను సందర్శించారని తెలిపారు.
దేశంలోని చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు నుమాయిష్ వేదిక కావడం సంతోషకరమన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 20 విద్యా సంస్థలు నడపడం ఎంతో గొప్ప విషయమన్నారు. 46 రోజులపాటు వేల స్టాళ్లతో నుమాయిషన్ ను సజావుగా నిర్వహించడం కత్తిమీద సాము లాంటిదన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారన్నారు.
17 ప్రభుత్వ విభాగాలను కోఆర్డినేషన్‌కు రోల్ మోడల్ గా నిలబడిందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా ఈసారి రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైందని, అందుకే ఈ నెల 17 వరకు పొడిగించారని తెలిపారు. అనంతరం సొసైటీ విద్యాసంస్థల్లోని మెరిట్స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఉత్తమ సేవలను అందించిన స్టాల్ నిర్వాహకులు, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, ఆర్ అండ్ బీ అధికారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, కోశాధికారి డాక్టర్ బి.ప్రభాశంకర్, కార్యక్రమ సలహాదారులు వనం వీరేందర్, కన్వీనర్ ధీరజ్ కుమార్ జైస్వాల్, సభ్యులు అలేఖ్య పుంజాల, వినయ్ కుమార్ ముదిరాజ్, డాక్టర్ గంగాధర్, సుఖేష్ రెడ్డి, ఆదిత్య మార్గం, అశ్విన్ మార్గం, రవి పాల్గొన్నారు.