శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండలపూజ, మకరవిలక్కు మహోత్సవం వైభవంగా ముగిసింది. సోమవారం (21 జనవరి) ఉదయం ఆలయాన్ని మూసివేసినట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్పను దర్శించుకున్న తర్వాత సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేశామని చెప్పారు. 2024–-25 తీర్థయాత్ర సీజన్‌లో దాదాపుగా 53 లక్షల మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారని పేర్కొన్నారు.
అంతకు ముందు సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి, తూర్పు మండపంలో గణపతి హోమం చేశామని వెల్లడించారు. అనంతరం మేల్శాంతి అరుణ్ కుమార్ నంబూద్రి అయ్యప్ప విగ్రహానికి విభూతాభిషేకం నిర్వహించి, దానిని రుద్రాక్షలతో అలంకరించారని టీడీబీ అధికారులు వివరించారు.