- స్టూడెంట్లకు సరిపోని బిల్డింగులు
- నెలలు గడుస్తున్నా పూర్తి కాని రినోవేషన్ వర్క్స్
- నత్తనడకన లేడీస్ హాస్టల్ నిర్మాణం
- కాంపౌండ్ లేని హాస్టల్ అమ్మాయిలకు కేటాయింపు!
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ లో తగిన సంఖ్యలో హాస్టళ్లు లేకపోవడంతో స్టూడెంట్లు కష్టాలు పడుతున్నారు. ఉన్న హాస్టళ్లను న్యాక్ గుర్తింపు కోసం రిపేర్ల పేరున క్లోజ్ చేశారు. కానీ పనులు మాత్రం పూర్తి చేయడం లేదు. మరోవైపు అమ్మాయిల కోసం కొత్తగా కడుతున్న బిల్డింగ్ పనులు స్లోగా సాగుతున్నాయి. దీంతో స్టూడెంట్లకు హాస్టళ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం కోసం ఎస్ఎఫ్ సీ, రెగ్యులర్ కోర్సుల స్టూడెంట్ల నుంచి ఫీజులు వసూలు చేస్తున్న ఆఫీసర్లు వారికి వసతి కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. దీంతో నాలుగైదు నెలల నుంచి స్టూడెంట్లు తరచూ ఆందోళన చేస్తున్నారు.
పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య..
కేయూలో మొత్తం14 హాస్టళ్లు ఉండగా.. ఇందులో గరిష్ఠంగా 3,066 మంది ఉండవచ్చు. కానీ ఈ ఏడాది 5వేల మంది హాస్టల్ ఫీజు కట్టగా.. కొంతమంది నాన్ బోర్డర్లు కూడా ఇదే హాస్టల్స్ ఉంటున్నారు. దీంతో అందుబాటులో ఉన్న బిల్డింగులు సరిపోవడం లేదు. వర్సిటీలో అబ్బాయిల కోసం పోతన, గణపతి దేవ–1,2,3, ఓల్డ్ ఫార్మసీ హాస్టల్, విద్యారణ్య, అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ హాస్టళ్ల ఉండగా.. వీటి సామర్థ్యం దాదాపు వెయ్యి. కానీ హాస్టల్లో ఉంటున్న వారి సంఖ్య 1200మంది. ఇక ఇంజినీరింగ్ హాస్టల్ ఏ,బీ,సీ బ్లాకుల్లో కెపాసిటీ 246 మాత్రమే.
కానీ ఇందులో దాదాపు 480 స్టూడెంట్స్ ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక క్యాంపస్ లో అమ్మాయిల కోసం పద్మాక్షి హాస్టల్ లో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు బ్లాక్‌లు ఏర్పాటు చేశారు. వీటన్నింటిలో 1,262 మందికి వసతి కల్పించే అవకాశం ఉంది. కానీ ఏటా వర్సిటీలో మెస్ కార్డ్స్ తీసుకుంటున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది 1,800 మందికి పైగా స్టూడెంట్లు హాస్టల్ వసతితీసుకోగా.. స్ట్రెంథ్ ఎక్కువ కావడంతో ముగ్గురు, నలుగురు ఉండాల్సిన రూములను ఆరేడు మందికి కేటాయిస్తున్నారు.
డెడ్ స్లోగా హాస్టల్ వర్క్స్..
వర్సిటీకి యూజీసీ న్యాక్ గుర్తింపు కోసం ఈ ఏడాది జూన్ లో హాస్టళ్ల రిపేర్ల పనులకు మొదలుపెట్టారు. దాదాపు రూ.80 లక్షలతో పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా గణపతిదేవ–1, 3, ఓల్డ్ ఫార్మసీ హాస్టల్స్ మూసి వేశారు. అందులో ఉన్న స్టూడెంట్లను మిగతా వాటిలో అడ్జస్ట్ చేశారు. అయితే జూన్ లో మూసేసిన హాస్టల్స్ ను ఇంతవరకు రీఓపెన్ చేయడం లేదు. మరోవైపు అమ్మాయిల సంఖ్య ఎక్కువ కావడంతో పద్మాక్షి హాస్టల్ ఎదురుగా మరో బిల్డింగ్ నిర్మించేందుకు గతేడాది పనులు స్టార్ట్ చేశారు. కానీ ఇంతవరకు పనులు పూర్తి చేయలేదు.
తరచూ వివాదాలు.. విద్యార్థుల ఆందోళనలు
కేయూ ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఎఫ్సీ స్టూడెంట్ల నుంచి హాస్టల్ ఫీజులు వసూలు చేసి.. వారికి వసతి క్యాన్సిల్స్ చేస్తున్నట్లు ప్రకటించడంతో కొద్దిరోజుల కిందట వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తాజాగా పోతన హాస్టల్ ను ఖాళీ చేయాల్సిందిగా వర్సిటీ ఆఫీసర్లు ఆదేశాలు ఇవ్వడం మరోసారి వివాదాస్పదమైంది. ఆ హాస్టల్‌ను ఖాళీ చేయించి అమ్మాయిలకు కేటాయించే ప్రయత్నం చేయడంతో విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. కాంపౌండ్ వాల్ లేని హాస్టల్‌ను
అమ్మాయిలకు కేటాయించడమేంటని
ప్రశ్నిస్తున్నారు. ఆ నిర్ణయంపై స్టూడెంట్యూనియన్స్, ఆఫీసర్లకు మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తోంది. కాగా వర్సిటీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త హాస్టల్స్ నిర్మించడం, ఉన్నవాటికి రిపేర్లు చేయించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికైనా కాకతీయ యూనివర్శిటీలో మరిన్ని హాస్టల్స్ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా.. ఇప్పుడున్న వాటిలో సౌకర్యాలు మెరుగుపరచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్నం
క్యాంపస్‌లో లేడీస్ హాస్టల్స్ సరిపోవడం లేదు. ఒక్కో రూమ్‌లో ఐదు నుంచి ఆరుగురం ఉంటున్నం. ఇరుకు గదుల్లో ఎక్కువ మంది ఉండటం వల్ల చదువు కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. హాస్టళ్లలో వాటర్, శానిటేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా హాస్టళ్ల సంఖ్యను పెంచాలి. సౌకర్యాలు మెరుగుపరచాలి. - హారిక, ఇంజినీరింగ్ స్టూడెంట్