ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్ల మూసివేత

హైదరాబాద్ జంట జలాశయాల గేట్లను అధికారులు మూసివేశారు.  వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వ‌ర‌ద ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసేశారు. సోమ‌వారం ఉద‌యం నాటికి హిమాయ‌త్ సాగ‌ర్ ఒక గేటు ఒక అడుగు మేర‌, ఉస్మాన్‌సాగ‌ర్ 2 గేట్లు ఒక అడుగు మేర తెరిచి ఉన్నాయి. ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిపోవ‌డంతో గేట్లను పూర్తిగా మూసివేశారు. 

ఈ సీజ‌న్‌లో గ‌త నెల 10న మొద‌టిసారి జంట జ‌లాశ‌యాల గేట్లను అధికారులు ఎత్తారు. ఆ త‌ర్వాత ఇన్‌ఫ్లో పెరిగిన‌ప్పుడు క్రమంగా ఎక్కువ గేట్లను ఎత్తి నీటిని కింద‌కు వ‌దిలారు. ఇటీవ‌ల ఇన్‌ఫ్లో త‌గ్గుముఖం ప‌ట్టడంతో క్రమంగా ఎత్తిన‌ గేట్లను మూసి వేస్తూ వ‌స్తున్నారు. సోమ‌వారం చివ‌రి గేట్లను కూడా మూసివేశారు.

కాగా ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1786.20 అడుగుల మేర నీరు ఉంది. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 3.900 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.05 టీఎంసీల నీరు ఉంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1760.05 అడుగుల నీరు ఉంది. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 2.968 టీఎంసీలు కాగా, ప్రస్తుతం  2.294 టీఎంసీల నీరు ఉంది.