వారం నుంచి 15 రోజుల ప్యాకేజీతో సేవలు
బ్రేక్ ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు తక్కువ ధరల్లో
ఉపాధి పొందుతున్న మహిళలు, ఉద్యోగాలు కోల్పోయినవాళ్లు
రుచికరమైన భోజనాన్ని అందిస్తూ ఫుడ్ బిజినెస్
72 ఏళ్ల శర్మ దంపతులు గచ్చిబౌలిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. కొడుకు, కోడలు యూఎస్ లో సెటిలయ్యారు. కరోనా కారణంగా గేటెడ్ కమ్యూనిటీల్లో పని మనుషులపై బ్యాన్ విధించడంతో.. శర్మ దంపతులకు వంట చేసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో యూఎస్ లో ఉండే కొడుకు, కోడలు టెన్షన్ లో పడ్డారు. హోమ్ లీ ఫుడ్ కు సంబంధించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చూసిన శర్మ కోడలు.. వాళ్లను సంప్రదించి సేవలకు ఆర్డర్ ఇచ్చింది. ఇక శర్మ దంపతులకు మూడు పూటలా కమ్మని భోజనం టైమ్ కు అందుతోంది. ఆరు నెలలుగా వారికి ఈ సేవలు అందుతున్నయి.
మల్కాజిగిరిలో నివాసం ఉండే శ్రీనివాస్ కు మార్చి నెలలో కరోనా వచ్చింది. తనతోపాటు ఇంట్లో ఉండే మరో ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇంటి నుంచి బయటకెళ్లే పరిస్థితి లేక రెండ్రోజులు ఫుడ్ కు ఇబ్బంది పడ్డారు. పొరుగున ఉన్న ఓ మహిళ.. మూడు పూటలా భోజనం పెట్టేందుకు ముందుకు వచ్చింది. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఇంట్లో వండిన వేడి వేడి ఫుడ్ తీసుకువచ్చి ఇచ్చింది. టైంకు మంచి ఫుడ్ దొరకడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా 15 రోజుల్లో నార్మల్ లైఫ్ లోకి వచ్చారు.
హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలను తారుమారు చేసింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అయినా కొందరు కొత్తగా ఆలోచించి సొంతంగా ఉపాధి సృష్టించుకుంటున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఆలోచించకుండా తమకు తెలిసిన పనితో హాస్పిటాలటీ రంగంలోకి అడుగు పెట్టి హోమ్లీ ఫుడ్ సప్లయర్ గా సేవలు అందిస్తున్నారు. సిటీలో కరోనా కారణంగా తిండి కోసం ఇబ్బంది పడేవారికి ఫుడ్ అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. క్లౌడ్ కిచెన్ గా పిలిచే ఈ బిజినెస్ ఇప్పుడు సిటీలో జోరుగా సాగుతున్నది. కరోనా పేషెంట్లు, సీనియర్ సిటిజన్లకు ఫుడ్ సప్లయ్ చేస్తూ ఆదాయం పొందుతున్నారు. పరిమితంగా మొదలైన ఈ సేవలు... ఇప్పుడు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇదే బాటలో హోటళ్లూ నడుస్తున్నాయి.
సర్వీస్ తోపాటు ఇన్ కమ్
బిజినెస్ ఔత్సాహికులు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు, మహిళలు హోం మేడ్ ఫుడ్ సప్లయ్ ర్లుగా మారిపోయారు. కరోనా పేషెంట్లను ఇంటివాళ్లే పట్టించుకోలేని పరిస్థితిలోనూ..మూడు పూటలా భోజనాన్ని అందిస్తూ సర్వీస్ తో పాటు ఇన్ కమ్ పొందుతున్నారు. మంచి ఫుడ్ అందిస్తూ వాళ్లు కోలుకునేంత వరకు సేవలు అందిస్తున్నారు. సిటీలో ఇలాంటి హోమ్లీ ఫుడ్ ను డెలివరీ చేసేవాళ్లు 50 మందికిపైనే ఉన్నారు. ఎలాంటి ప్రచారం లేకున్నా, కరోనా రోగులు, సీనియర్ సిటిజన్లు, ఇంట్లో వంట చేసుకోలేని వారికి కూడా ఇంటి భోజనాన్ని సరఫరా చేస్తూ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. ఒకరిద్దరితో మొదలుపెట్టి, సిటీలో ఎక్కడికైనా ఫుడ్ డెలివరీ చేసే స్థాయికి చేరుకుంటున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సమయానికి ఫుడ్ పార్శిల్ చేరవేస్తున్నారు. ఆరు నెలలుగా ఈ వ్యాపారం చేస్తుండగా, ఇప్పటివరకు వచ్చిన వారంతా మౌత్ టాక్ తో వచ్చిన రిఫరెన్సేనని వనస్థలిపురానికి చెందిన హోం మేడ్ ఫుడ్ సప్లయర్ చెబుతున్నారు. ప్రస్తుతం తన కస్టమర్లే మరికొంత మందికి కూడా సప్లయ్ చేయమని అడుగుతున్నారని వివరించారు.
అన్ని రకాల ప్యాకేజీలు...
హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్లు, సీనియర్ సిటిజన్స్ కు టైంకు మంచి ఫుడ్ ను డెలివరీ చేస్తున్నారు. హోమ్ మేడ్ ఫుడ్ సప్లయర్స్. వారం రోజులు, 15 రోజులు, నెలవారీ ప్యాకేజీలతోపాటు సేవలు అందిస్తున్నారు. ఒక్కసారి ప్యాకేజీ సెట్ చేసుకుంటే మార్నింగ్ 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం 12.30 లోపే లంచ్, రాత్రి 7.30లోపు డిన్నర్ పార్శిళ్లను ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. కొందరు డెలివరీ ఛార్జీలను అదనంగా తీసుకుంటుండగా, మరికొందరు అన్ని కలిపే ఛార్జ్ చేస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ మెనూకు వేర్వేరుగా ఛార్జీలు ఉన్నాయి. సాధారణంగా మూడు పూటలా భోజనానికి రూ.280–రూ.450 మధ్య ఉండగా, నాన్ వెజ్ అయితే మరో రూ.100– రూ.200 అదనంగా తీసుకుంటున్నారు. కొంత మంది నేరుగా హాస్పిటళ్లతో టై అప్ అవుతుండగా, మరికొంత మంది అపార్ట్ మెంట్ వాసులకు మాత్రమే ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. మహారాష్ట్రీయన్ కిచెన్ (9160494699), డీప్స్ కిచెన్ (9014367637) తో పాటు పలువురు ఫుడ్ సప్లయర్స్ ఫేస్ బుక్ లేదా వాట్సప్ నంబర్లతో ఆర్డర్లు తీసుకుంటున్నారు.35 మందికి ఫుడ్
సప్లయ్ చేస్తున్నా..
మూడు నెలల క్రితం హోమ్ ఫుడ్ సప్లయ్ స్టార్ట్ చేశా. అమ్మ చేసిన వంటకాలను ప్యాకింగ్ చేసి డోర్ డెలివరీ చేస్తా. ప్రస్తుతం 35 మందికి సర్వీస్ అందిస్తున్నా. కరోనా టైంలో లాభాల కోసం కాకుండా సర్వీస్ బేస్డ్ గా బిజినెస్ చేస్తున్నాం. జొమోటో, స్విగ్గీలతో కలిసి పనిచేస్తున్నాం. కస్టమర్లు ప్యాకేజీ బుక్ చేసుకుంటారు కాబట్టి ఆర్డర్ల టెన్షన్ లేదు. - అజయ్ దేశ్ ముఖ్, ఫుడ్ సప్లయర్
ఫ్రూట్ పంచ్ నుంచి డ్రై ఫ్రూట్ వరకు
ఫ్రూట్ పంచ్ నుంచి డ్రై ఫ్రూట్ వరకు డెయిలీ ఒక వెరైటీతో ఫుడ్ సప్లయ్ చేస్తున్నాం. కరోనా పేషెంట్లు, వృద్ధులు, సింగిల్ గా ఉండే వారు ఫోన్లలో ఆర్డర్లు చేస్తారు. ఉదయం 6లోపే వంటలు చేసి వేడిగా ఉన్నప్పుడే డెలివరీ చేసేస్తాం. - సంతోషి, డీప్స్ కిచెన్ నిర్వాహకురాలు
ఇదే బాటలో హోటళ్లు...
హోటళ్లు కూడా హోం డెలివరీ సర్వీసులను స్టార్ట్ చేశాయి. తమ బ్రాంచుల పరిధిలోని నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఫుడ్ డెలివరీ చేయడం మొదలుపెట్టాయి. సిటీలో తమకు 8 బ్రాంచ్ లు ఉన్నాయని, ఒక్కో బ్రాంచ్ లో 10 నుంచి-15 మందికి ఫుడ్ డెలివరీ చేస్తున్నామని తార్నాకలోని కిన్నెర గ్రాండ్ హోటల్ నిర్వాహకులు చెప్పారు. కరోనా ఎక్స్ క్లూజివ్ సర్వీస్ అందిస్తున్నామని హిమాయత్ నగర్ లోని మరో హోటల్ నిర్వాహకుడు తెలిపారు. కృష్ణ జైన్, మిల్లెట్ మార్వెల్, పాలబిన్ని మిశ్ర, సంతోష్ దాబా లాంటి హోటళ్లు కూడా ఫేస్ బుక్, వాట్లాస్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాయి.