రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని సీఎల్పీ ఆరోపించింది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు చెప్తేనే పోలీసుల దగ్గర న్యాయం జరిగే పరిస్థితి తలెత్తిందని అన్నారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
గవర్నర్ తో భేటీ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వనమా రాఘవ వ్యవహారం, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథనిలో అడ్వకేట్ హత్య తదితర ఘటనల్ని తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతలు పోలీసుల్ని స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల నుంచి రక్షణ ఉంటుందన్న భావనను రాష్ట్ర ప్రజలు కోల్పోయారని సీఎల్పీ నేతలు ఆరోపించారు. గవర్నర్ వెంటనే పోలీస్ శాఖపై సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలివ్వాలని కోరారు.