మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వ భూములు, ఆస్తులను వేలం వేస్తూ కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్నే సేల్కు పెట్టాడని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల వందల కోట్ల విలువైన భూములను తనకు అనుకూలంగా ఉన్న కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు కట్టబెడుతూ రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు భూములు లేకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నది సంపదను సృష్టించి ప్రజలకు పంచడానికే తప్ప భూములను, ఆస్తులను అమ్ముకోవడానికి కాదన్నారు.
ప్రభుత్వ భూముల అమ్మకం విధానానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భట్టి 17వ రోజు పాదయాత్ర శనివారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మెట్పల్లి, చిత్తాపూర్, ఆవడం, భీమారం మండలం కాజిపల్లి, నర్సింగాపూర్ లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థను కేసీఆర్ ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.