ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు: అధికార పార్టీ లీడర్లు ఏం చెబితే పోలీసులు అది చేస్తున్నారని సీఎల్పీ లీడర్భట్టి విక్రమార్క ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి వార్నింగ్ఇచ్చారు. ‘పీపుల్స్ మార్చ్’లో భాగంగా గురువారం ఆయన కూసుమంచి మండలంలో పర్యటించారు.
జీళ్లచెరువులో మాట్లాడుతూ.. కందాలకు దమ్ము ఉంటే తన పదవికి రాజీనామా చేసి ప్రజల మధ్యకు వచ్చి ఓట్లు అడగాలని సవాల్‌విసిరారు. కాంగ్రెస్జెండాతో గెలిచి, సిగ్గు, ఎగ్గు లేకుండా పార్టీ మారాడని విమర్శించారు. తమ కార్యకర్తలపై కేసులు పెట్టించి, పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లి అధికార పార్టీ కండువాలు కప్పుతారా అని ప్రశ్నించారు. కందాల వంటి కాంట్రాక్టర్లను కాంగ్రెస్‌పార్టీ చాలామందినే చూసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కందాలను ఇంటికి పంపించాలని, పాలేరు ప్రజలు ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ప్రభుత్వం రాష్ట్ర సంపదను దోచేస్తుందని మండిపడ్డారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రతి పేదవాడికి రెండు గదులతో ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆయన వెంట జిల్లా నాయకులు దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు, రాంరెడ్డి, చరణ్ రెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.