బీఆర్ఎస్​ను కాళేశ్వరంలో ముంచాలే : భట్టి విక్రమార్క

ముదిగొండ, వెలుగు :  మాయ మాటలతో కాలం గడిపే బీఆర్ఎస్ ను ఈసారి కాళేశ్వరంలో ముంచేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మధిరలో తనను మరోసారి గెలిపిస్తే ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా పని చేస్తానని చెప్పారు. శనివారం మండల పరిధిలోని న్యూలక్ష్మీపురంతో పాటు ఖానాపురం, పండ్రేగుపల్లి, కోదండరాపురం, ముత్తారం, వనంవారి కిష్టాపురం, కమలాపురం, అయ్యగారిపల్లి, అమ్మపేట, వల్లాపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలవబోతున్నారని తెలిపారు. రాష్ట్ర మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే ఎదురుచూస్తోందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మధిర నియోజకవర్గం కీలక భూమిక  పోషిస్తుందన్నారు. దేశంలో ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ప్రతి రోజు తలుచుకోవాలన్నారు. గారడీ మాటలు చెప్పే బీఆర్​ఎస్​ను, మతాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 
భట్టి గెలుపు తెలంగాణకు అవసరం : ఏపీ పీసీసీ అధ్యక్షుడు

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భట్టి విక్రమార్క గెలవడం తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరంమని రాహుల్ గాంధీ తనకు చెప్పారని, అందుకే ఈ ప్రచారానికి వచ్చినని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. శనివారం ముదిగొండ మండలంలోని ఖానాపురం, పండ్రేగుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ఉన్న భట్టిని ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. ప్రచారానికి మద్దతుగా రుద్రరాజుతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ, విజయవాడ సిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావులు, ఇతర ఏపీ నేతలు ఉన్నారు.

ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా భట్టి అసెంబ్లీలో కేసీఆర్  ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలపై గడగడలాడించారన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత జూడోయాత్ర స్ఫూర్తితో భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టారన్నారు. యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకొని రాహుల్ గాంధీకి వివరించగా ప్రకటించినవే ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ మేనిఫెస్టోని తెలిపారు. బీఆర్​ఎస్​ ఎన్ని కుట్రలు పన్నిన గెలుపు కాంగ్రెస్​దేనన్నారు.