కలల ప్రపంచంలోకి నెట్టి.. ఆత్మహత్యలకు కారణమైతున్నరు: సీఎల్పీ నేత భట్టి

  •    మోసపు హామీలిస్తున్నరని కేసీఆర్​పై సీఎల్పీ నేత భట్టి ఫైర్
  •     దళిత యువకుడు రమాకాంత్ సూసైడ్​పై ఆవేదన
  •     ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్
  •     కమ్యూనిస్టులతో పొత్తు జాతీయ స్థాయిలో నిర్ణయిస్తారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: మోసపూరిత హామీలు, ప్రకటనలతో సీఎం కేసీఆర్ ప్రజలను కలల ప్రపంచంలోకి నెట్టి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఆదిలాబాద్ జిల్లా బోరోజ్ గ్రామానికి చెందిన దళిత యువకుడు రమాకాంత్​ దళితబంధు రాక ఆత్మహత్య చేసుకున్నాడని, తన చావుకు సీఎం కేసీఆరే కారణమంటూ సూసైడ్ లేఖ రాశాడని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. 

అతడి చావుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము పోరాడుతామని తేల్చి చెప్పారు. శుక్రవారం ఆయన గాంధీభవన్​లో పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ కమ్యూనికేషన్స్ ఇన్ చార్జ్ అజయ్​ ఘోష్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. సమాజం ఏమైపోయినా ఫర్వాలేదు.. తాను బాగుండాలని, తన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండాలని అనుకునే వ్యక్తి పాలకుడుగా ఉండడం దౌర్భాగ్యమన్నారు. దళితులకు మూడు ఎకరాలు, దళిత సీఎం, దళిత బంధు వంటి హామీలతో దళితులను కలల ప్రపంచంలోకి నెట్టి కేసీఆర్​ సీఎం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.400 కోట్లైనా ఖర్చు చేయలే

దళితబంధు పథకం పేరుతో దళితులను కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా దగా చేసిందని భట్టి ఫైర్ అయ్యారు. బడ్జెట్​లో రూ.17,700 కోట్లు చూపించి.. కనీసం రూ.400 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్​ను బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదోవ పట్టించిందన్నారు. ఎవరూ నిరాశపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 

కాంగ్రెస్ సర్కార్ రాగానే ప్రజల సంపదను ప్రజలకే పంచుతామన్నారు. సీఎం, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు రాష్ట్రమంతటా ప్రజలను మభ్యపెట్టేందుకు గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని కోరారు.

షర్మిల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం

లెఫ్ట్​తో పొత్తుపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని భట్టి చెప్పారు. వారితో పొత్తులు, సీట్ల విషయమంతా జాతీయ స్థాయిలోనే నిర్ణయిస్తారని, తగిన సమయంలో వారే ప్రకటిస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్​కు నష్టం జరగకూడదని వైఎస్ఆర్ కూతురిగా ఆమె చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారు. రాహుల్ హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న అసదుద్దీన్ సవాల్​పై స్పందిస్తూ.. రాహుల్ గాంధీ జాతీయ నాయకుడని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు.