హైదరాబాద్: చదువురాని వాళ్లు దేశాన్ని ఏలుతున్నారని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలు రోహిత్, బల్మూరి వెంకట్ లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ... రైల్వే రిక్రూట్ బోర్డు, టెట్ ఎగ్జామ్ ఒకే రోజున ఉండటంతో నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉందని, ఇదే విషయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికి వెళ్లిన తమ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అలాగే సాలార్ జంగ్ మ్యూజియంలో నెహ్రూ ఫోటో పెట్టాలని కోరుతూ అక్కడికి వెళ్ళిన రోహిత్ బృందాన్ని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పక్షాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. గాంధీ, నెహ్రూ లేకుండా దేశ స్వాత్రంత్య్ర సంగ్రామం లేదన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశ నిర్మాణ కోసం శ్రమించిన మహనీయులను బీజేపీ అవమానించిందని ఆరోపించారు.
ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ లో గాంధీ, నెహ్రూ వంటి నేతలను స్మరించకుండా మోడీ ప్రభుత్వం అవమానించిందన్నారు. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ లో భాగంగా సాలార్ జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనలో నెహ్రూ ఫోటో పెట్టకపోవడం దుర్మార్గమన్నారు. మోడీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తోందన్న ఆయన... అవగాహనలేని నేతలు దేశాన్ని పరిపాలించడం దురదృష్టకరమన్నారు. గాంధీ, నెహ్రూల ఫోటోలకు బదులు బ్రిటిష్ వాళ్ల అడుగులకు మడుగులొత్తిన సావర్కర్ ఫోటోను పెట్టడం చూస్తే... బీజేపీ నాయకులకు దేశంపై ప్రేమ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ , అటు కేంద్రంలో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
మరిన్ని వార్తల కోసం...