భూ నిర్వాసితులపై కక్ష సాధింపు అన్యాయం
ఉద్దండపూర్ బాధితులను బెదిరిస్తున్నరు : సీఎల్పీ నేత భట్టి
జడ్చర్ల టౌన్, వెలుగు : పాలమూరు లిప్ట్ ఇరిగేషన్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిపై కక్ష సాధింపునకు దిగడం అన్యాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ముంపునకు గురవుతున్న ఉద్దండపూర్ గ్రామానికి బుధవారం పాదయాత్ర చేరుకున్న సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి తీసుకున్న భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరితే బీఆర్ఎస్ పెద్దలు, ఆఫీసర్లు నిర్వాసితులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
ఉద్దండపూర్, వల్లూరు రైతులను పోలీసులతో బెదిరించి, బలవంతంగా భూములు గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నిర్వాసితులు సిద్ధపురం మల్లయ్య, లక్ష్మమ్మ తదితరులు కోర్టును ఆశ్రయించారని, దీంతో వారిపై సర్కారు కక్ష గట్టిందని అన్నారు. మల్లయ్య భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారని, లక్ష్మమ్మకు ఐదు ఎకరాల భూమి ఉంటే 18 గుంటలకు మాత్రమే పాస్ బుక్కులు ఇచ్చారని చెప్పారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. ఉద్దండపూర్, వల్లూర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద జడ్చర్ల ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ పక్కన ప్లాట్లు కేటాయిస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మోసం చేశారన్నారు.