ఎఫ్​ఆర్వో కుటుంబానికి సీఎల్పీ నేత భట్టి పరామర్శ

ఖమ్మం టౌన్,వెలుగు: హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(ఎఫ్​ఆర్వో) శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామానికి శనివారం భట్టి విక్రమార్క వెళ్లి ఎఫ్​ఆర్వో శ్రీనివాసరావు భార్యాపిల్లలు, తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని అన్నారు. ప్రభుత్వం ప్రకటించినట్టుగా డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఉద్యోగం వెంటనే కుటుంబానికి ఇవ్వాలన్నారు. 

పోడు పట్టాలు పంపిణీ చేస్తామన్న సర్కారు హామీ కాగితాలకే పరిమితం కావడం వల్లే శ్రీనివాసరావు ప్రాణం పోయిందన్నారు. పోడు భూముల వద్ద కుర్చీ వేసుకొని సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ ​చెప్పి 8 ఏండ్లు అవుతోందని గుర్తు చేశారు. నేటికీ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం పోడు రైతుల సమస్యలను నాన్చకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, పీసీసీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.