గోదావరి వరదలతో అతలాకుతలమైన భద్రాచలం డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్య పరిశీలించారు. భద్రాచలం నుండి దుమ్ముగూడెం వెళ్లే మార్గ మధ్యలో పాత నారాయణ పేట వద్ద వరి నాట్లు వేస్తున్న మహిళల వద్దకు వెళ్లారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య.
ఈ సందర్భంగా మహిళా కూలీలు వారి సమస్యలను కాంగ్రెస్ నాయకులకు చెప్పుకున్నారు. తాను బీఎస్సీ నర్సింగ్ చేసి ఉద్యోగ అవకాశాలు లేక కూలీ పనులకు వెళ్తున్నానని వీరభద్రమ్మ అనే మహిళ చెప్పగా.. తాను Bcom కంప్యూటర్స్ చేసి కూలీ పనులకు వెళ్తున్నానని మరో మహిళ నాగమణి చెప్పారు. ఐటీడీఏ నుండి బోర్లు వేసుకోడానికి తమకు ఎటువంటి నిధులు అందడం లేదని మరికొందరు మహిళలు వివరించారు. మహిళా కూలీల సమస్యలను సావధానంగా విన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. మరో నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పారు. అప్పుడు అందరి సమస్యలు పరిష్కారమవుతాయని వారికి భరోసా ఇచ్చారు.