దళిత బంధు తరహాలో బీసీ బంధు ప్రవేశపెట్టాలె : మల్లు భట్టివిక్రమార్క

పెద్దపల్లి జిల్లా : దళిత బంధు తరహాలో బీసీ బంధు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. స్వరాష్ట్రంలో మార్పు వస్తుందనుకున్న వారిలో నిరాశే మిగిలిందని చెప్పారు. 2014, 2015 నుంచి 2 లక్షల కోట్ల బడ్జెట్ లో పెద్దఎత్తున నిధులు వస్తాయని భావించినా.. ఆశించిన స్థాయిలో బలహీన వర్గాలకు అందలేదన్నారు. కేవలం ఐదు శాతం నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. చివరకు కేటాయించిన నిధులను కూడా విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా పెద్దపల్లి మండలం మరెడుగొండలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో భట్టి ఈ కామెంట్స్ చేశారు.

ఆత్మగౌరవంతో తలెత్తుకుని నిలబడే తెలంగాణను రాష్ట్ర ప్రజలు ఆశించారని, బడుగు, బలహీన వర్గాలు ఆశించిన తెలంగాణ ఇది కాదని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 54 శాతం ఉన్న బీసీలను ఉదహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దళిత బంధు తరహాలో బీసీ బంధు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖను మీడియా ఎదుట విడుదల చేశారు మల్లు భట్టి విక్రమార్క.