బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కృష్ణానదిలో ముంచుదాం : మల్లు భట్టి విక్రమార్క 

కొల్లాపూర్ సభ రేపు రాష్ట్ర గతిని మార్చేటువంటి సభ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి కొల్లాపూర్ సభ సంకేతం ఇస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియమాకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. అందుకే అనాడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతున్నా... కృష్ణానదిలో చుక్కనీరు కూడా పారించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా భేరి బహిరంగ సభలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. 

అనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ప్రాజెక్టుల ద్వారానే ఈ ప్రాంతంలో తాగు, సాగు నీరు పారుతోందని చెప్పారు. ఏ నీళ్ల కోసమైతే కోట్లాడామో ఆ నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కృష్ణానదిలో ముంచుదామని చెప్పడానికే తామంతా కొల్లాపూర్ కు వచ్చామని చెప్పారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్​ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ లో చేరాడని, ఆయనకు రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసుకోవాలంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకుంటేనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర సంపద, వనరులను ప్రజలకే పంచుతామన్నారు. 

Also Read :- మోదీ ప్రాణం అదానీ చేతిలో.. అందుకే ఫోన్లు ట్యాపింగ్: రాహుల్