- కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే..6 గ్యారంటీలు పక్కా
- ఎన్నికల ప్రచారంలో భట్టి
మధిర/భోనకల్, వెలుగు: ఉచిత కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దే అని, ఆ పేటెంట్ కాంగ్రెస్ కే ఉందని మధిర అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉచిత కరెంటు తానే ఇస్తున్నట్టు కేసీఆర్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలో ని బోనకల్ మండలం ముష్టికుంట్ల, లక్ష్మీపురం, గోవిందాపురం ఎల్ గ్రామాల్లో సోమవారం భట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, కరెంటు ఉండదని పిచ్చి మాటలు మాట్లాడటం కేసీఆర్ మానుకోవాలని అన్నారు.
ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు పావలా వడ్డీకే రుణాలు , పంట నష్టపరిహారం ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పరిపాలనలో రైతులకు ఒక్కసారైనా పంటలకు నష్ట పరిహారం ఇచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల బతుకులు మారాలని ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. కానీ, పది సంవత్సరాలుగా తెలంగాణ సంపదను బీఆర్ఎస్ పాలకులు పంచుకుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తామనితెలిపారు.
మధిరను మరింత అభివృద్ధి చేస్తా..
మధిర నియోజకవర్గాన్ని మరోసారి అభివృద్ధి చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వస్తున్నదని, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తానని తెలిపారు. మధిరకు నిధులు వరదల పారిస్తానని, పరిశ్రమలు తెస్తానని, ఇందిరమ్మ డైరీ పెడతానని, 53 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళ సభ్యులకు ఇందిరమ్మ డైరీలో వాటా కల్పించి వ్యాపారవేత్తలుగా తయారు చేస్తానన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మధిరను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి
అని అన్నారు.
భట్టి విక్రమార్కను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య
భట్టి విక్రమార్కను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య కోరారు. సోమవారం భట్టి ప్రచారంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వి గ్యారెంటీ మాటలు.. కేసీఆర్ వి నీళ్ల మాటలు అన్నారు. నోటికొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడటానికి కేసీఆర్ ది నోరా? మున్సిపాలిటీ మోరీనా? అన్నారు. కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తుందని, సంక్షేమం అభివృద్ధి అందిస్తుందని అన్నారు. తెలంగాణ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చిందని, అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా ఉండబోతోందన్నారు.
6 గ్యారంటీలు అమలు అఫిడవిట్‌పై సంతకం..
మధిర : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని బోనకల్ మండలం చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి దేవాలయంలో దేవుడి ఎదుట సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అఫిడవిట్‌పై సంతకం చేశారు.