- ఇందిరమ్మ రాజ్యం కోసం ఎదురుచూస్తున్నరు : భట్టి
- రాష్ట్ర సంపదను బీఆర్ఎస్ లీడర్లు దోచుకున్నరు
- మళ్లీ జనాన్ని మోసం చేసేందుకు కేసీఆర్ వస్తున్నడు
- కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది దోపిడీదారుల కోసం కాదు
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటన
ఖమ్మం, వెలుగు : రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ దోపిడీ అర్థమైందని, ఆ పార్టీ మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ‘‘బీఆర్ఎస్ను ప్రజలు ఈ ఎన్నికల్లో ఉతికి ఆరేస్తరు. పదేండ్లలో రాష్ట్ర సంపదను దోచుకున్న బీఆర్ఎస్ లీడర్లను, ప్రభుత్వ పెద్దలను తరిమికొడ్తరు. దోపిడీ ప్రభుత్వాన్ని వదిలించుకుని, ప్రజా ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని ఓటర్లు ఎదురుచూస్తున్నరు” అని ఆయన పేర్కొన్నారు. దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెప్పి మోసగించారని, మళ్లీ ఇలాంటి హామీలిచ్చి మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. ‘‘కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది దొరల కోసమో.. దోపిడీదారుల కోసమో కాదు.
ప్రజల బాగు కోసం” అని అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని అనంతసాగర్లో భట్టి విక్రమార్క బుధవారం మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు బూత్ లెవల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత స్టేట్లో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు గానీ, ఒక్క ఇండస్ట్రీ గానీ రాలేదని, రాష్ట్రాన్ని కేసీఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేశారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎక్స్పైరీ అయిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేందుకే ఈ గ్యారంటీలను ప్రకటించామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ డే నుంచే ప్రజలకు గ్యారంటీ కార్డులు ఇస్తామన్నారు.
సరైన టైమ్లో అభ్యర్థుల లిస్ట్
బీజేపీకి బీఆర్ఎస్ బీ టీంలాగా పనిచేస్తున్నదని, ఆ పార్టీలకు ఎంఐఎం వంత పాడుతున్నదని భట్టి విక్రమార్క ఆరోపించారు. ‘‘దేశ సంపదను కార్పొరేట్సంస్థలకు బీజేపీ కట్టబెడుతుంటే.. రాష్ట్రంలో భూములను బీఆర్ఎస్ అమ్ముతున్నది. హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న భూములన్నిటిని అప్పనంగా అమ్మేసుకుంటున్నరు. ప్రభుత్వ ఆస్తుల్ని, ఔటర్ రింగ్ రోడ్డును పనికిమాలిన సంస్థకు లీజుకు ఇచ్చేశారు” అని ఆయన దుయ్యబట్టారు. ‘‘సరైన టైమ్లో కాంగ్రెస్అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తం. బీఆర్ఎస్ లీడర్లు పార్టీ మారతారన్న భయంతోనే ముందుగా కేసీఆర్అభ్యర్థులను ప్రకటించిండు” అని అన్నారు. కమ్యూనిస్టులతో పొత్తులపై జాతీయ స్థాయిలో నిర్ణయం జరుగుతుందని చెప్పారు. షర్మిల పార్టీ విలీనంపైనా హైకమాండ్ చర్చిస్తుందని, ఆ స్థాయిలోనే నిర్ణయాలు ఉంటాయన్నారు.