సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర మే25వ తేదీన జడ్చర్ల కు చేరుకోనుంది. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘పీపుల్స్ మార్చ్ బహిరంగసభ’కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు హాజరుకానున్నారు. జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం వరకు పాదయాత్ర రాగానే మొత్తం 800 కిలోమీటర్ల మేర భట్టి పాదయాత్ర పూర్తికానుంది. 69 రోజుల్లో వందల గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. మార్చి16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.
‘‘పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ’’ మే 25న సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆట, పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ సభకు తెలంగాణ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బహిరంగ సభకు తరలిరానున్నారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం షెడ్యూల్ ఇదే..
* ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు హిమాచల్ ప్రదేశ్ సీఎం చేరుకొంటారు.
* సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా జడ్చర్లకు బయలుదేరుతారు.
* సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు జడ్చర్ల బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు.
* రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరిగి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
* అక్కడి నుంచి రాత్రి 9 గంటల 55 నిమిషాలకు విమానంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
* హిమాచల్ ప్రదేశ్ సీఎం రాక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు భద్రత చర్యలు ఏర్పాటు చేశారు.