పేదల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ లో రిమ్స్ ను ఏర్పాటు చేస్తే.. ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్పత్రికి ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వడంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఈ రోజు కాంగ్రెస్ నేతలతో కలిసి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ను సందర్శించారు. పిపిఇ కిట్లు ధరించి ఐసోలేషన్ వార్డులోకి వెళ్లి కరోనా పేషంట్లతో మాట్లాడారు. కరోనాతో చావులన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక్క రిమ్స్ లోనే 100 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐసోలేషన్ లోని పేషంట్లు భయంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చెరువులు, భూముల కబ్జాపై ఉన్న దృష్టి కరోనా సౌకర్యాలపై లేదు. కరోనా అంటే తెలియని అమాయక గిరిజనులు దేవుళ్ళకు మొక్కుతున్నారు. మద్యం ఎక్కువ తాగండి, ఎక్కువ కరోనా తెచ్చుకోండి అని సర్కార్ అమాయకులను గాలికి వదిలేసింది. రాష్ట్రంలో ఏ ఒక్క ఆస్పత్రి సరిగ్గా లేదు. కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మెల్కోలపడానికే కాంగ్రెస్ పార్టీ ఆస్పత్రుల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో కరోనాపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం’ అని ఆయన అన్నారు.
For More News..