
దేశంలో ఆదాయపపన్ను శాఖ రోజురోజుకూ టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రజల జీవితాలను, వారి ఆదాయాలను, ఖర్చులను వారికి తెలియకుండానే గమనిస్తూనే ఉంది. ఇందుకోసం ఏఐ టెక్నాలజీతో కూడిన అనేక టూల్స్ నిరంతరం జోడిస్తూ ట్రాన్పరెన్సీని పెంచటంతో పాటు పన్ను ఎగవేతదారులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
వివరాల్లోకి వెళితే ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఒక కొత్త బ్రోచర్ విడుదల చేసింది. ఇందులో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఆదాయ నిబంధనల గురించి చెబుతూ.. ఎలాంటి సందర్భంలో పన్ను వారి ఆదాయంగా పరిగణించబడుతుంది,. వారి పన్ను చెల్లింపులకు కలపబడుతోందో హైలైట్ చేస్తుంది. వాస్తవానికి పన్ను చట్టంలో ఉన్న ఇన్కమ్ క్లబ్బింగ్ కింద సదరు వ్యక్తి జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా ఇతర వ్యక్తులకు సంబంధించిన ఆదాయాన్ని మెుత్తం ఆదాయంలో పన్ను చెల్లింపులకు పరిగణించబడి లెక్కించబడుతుంది. అయితే ఇది ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుందో క్లారిటీ చాలా ముఖ్యం.
-ముందుగా పన్ను చట్టంలోని సెక్షన్ 60 కింద ఒక వ్యక్తి ఆస్తిని బదిలీ చేయకుండా మరొక వ్యక్తికి ఆదాయాన్ని బదిలీ చేస్తే.. ఆదాయం బదిలీ చేసిన వ్యక్తే దానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
-అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 61 కింద పన్ను చెల్లింపుదారు ఏదైనా ఆస్తిని ఇతరులకు ఇచ్చినప్పటికీ దానిని తిరిగి పొందే హక్కును అతను కలిగి ఉన్నట్లయితే.. ఆ సందర్భంలో వచ్చిన ఆదాయాన్ని కూడా సదరు కాలానికి బదిలీదారు చేతిలోనే లెక్కించటం జరుగుతుంది.
-ఇలాగే చట్టంలోని సెక్షన్ 64(1)(ii), 64(1)(iv), 64(1),(vii)కింద జీవితభాగస్వామి కలిసిఉంటున్న సందర్భంలో వారి మధ్య ఏదైనా ఆస్తి బదిలీలు జరిగితే.. దాని నుంచి వచ్చే ఆదాయం బదిలీదారుని పన్నుకే కలపటం జరుగుతుంది.
-సెక్షన్ 64(1)(vi), 64(1)(viii)కింద ఎవరైనా వ్యక్తి తన కుమారుడి భార్య అంటే కోడలికి ఏదైనా ఆస్తిని బదిలీ చేస్తే దాని నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బదిలీ చేసిన మామగారి పన్నుకే కలపబడుతుందని ఆదాయపు పన్ను చట్టం చెబుతోంది.
-ఇదే క్రమంలో ఇంట్లోని చిన్న పిల్లల పేరుపై ఉన్న ఆస్తులు లేదా వారు చేసే ఏదైనా పని వల్ల వస్తున్న ఆదాయాన్ని వారి తల్లిదండ్రుల ఆదాయంలో కలపబడి పేరెంట్స్ దగ్గర పన్ను వసూలు చేయబడుతుంది. ఇక్కడ క్లబ్బింగ్ వర్తించే మైనర్ పిల్లల ఆదాయాన్ని సెక్షన్ 10(32) కింద అందించిన విధంగా ప్రతి బిడ్డకు రూ.1,500 వరకు ఆదాయంలో మినహాయింపు ద్వారా తగ్గింపు పొందవచ్చు.
ఇన్కమ్ క్లబ్బింగ్ ప్రభావం:
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. క్లబ్ చేయబడిన ఆదాయం ఎవరి చేతుల్లో ఉందో ఆ పన్ను చెల్లింపుదారుడికి వర్తించే శ్లాబ్ రేట్ల ప్రకారం సదరు ఆదాయంపై పన్ను విధించబడుతుంది. ఇది అధిక పన్ను బాధ్యతకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా తక్కువ పన్ను బ్రాకెట్లలోని వ్యక్తులకు ఆదాయం బదిలీ చేయబడినప్పుడు అది కలపబడిన వ్యక్తి చేతిలో అధిక పన్ను రేటును చూస్తుంది.