
- ఇకనైనా స్పీడ్ అందుకునేనా?
- గత అక్టోబర్ లో మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన
- తాజాగా ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు స్కూళ్లు మంజూరు
- ఒక్కో స్కూల్ కు రూ.200 కోట్ల చొప్పున నిధులు మంజూరు
- ఇక త్వరలో పనులు మొదలయ్యే అవకాశం..
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు ఇకనైనా స్పీడ్ అందుకునేనా అనే చర్చ కొనసాగుతోంది. గతేడాది అక్టోబర్ 11న రాష్ట్ర వ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం, మంత్రులు శంకుస్థాపన చేశారు. కాగా, జిల్లాలోని మధిర నియోజకవర్గానికి గాను బోనకల్ మండలం లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పాలేరు నియోజకవర్గానికి గాను ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం నియోజకవర్గానికి చెందిన స్కూల్ కు గాను రఘునాథపాలెం మండలం జింకలతండా దగ్గర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకే రోజు శంకుస్థాపన చేశారు.
నిధులు లేకపోవడంతో ఆ తర్వాత పనులేమీ జరగలేదు. తాజాగా ఈ మూడు స్కూళ్లకు అదనంగా ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం ఏడు స్కూళ్లకు రూ.200 కోట్ల చొప్పున రూ.1,400 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో త్వరలోనే పనులు ప్రారంభం అవకాశాలున్నాయి.
సౌలత్లన్నీ ఉండేలా ప్లాన్...
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో స్కూల్ ను 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మించనుండడంతో అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే డిజైన్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో స్కూల్ లో 2,560 మంది వరకు విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ఇలా అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుకోవచ్చు.
ప్రతీ స్కూల్ లో 120 మంది చొప్పున టీచర్లు పనిచేస్తారు. ఈ స్కూళ్లకు ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని నిర్మిస్తారు. ఒక్కో లైబ్రరీలో 5 వేల పుస్తకాలు, 60 కంప్యూటర్లు, క్లాసు రూముల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. 900 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్, స్టూడెంట్స్ తో పాటు టీచర్లకు రెసిడెన్షియల్ క్యాంపస్, ప్రతీ డార్మిటరీలో 10 బెడ్ లు, రెండు బాత్ రూమ్ లు ప్లాన్ చేశారు. క్యాంపస్ లో గ్రీనరీని డెవలప్ చేయడంతో పాటు సోలార్ ఎనర్జీ, వర్షపు నీటి సంరక్షణ, కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఆడిటోరియం, ఇండోర్, ఔట్ డోర్ స్టేడియంతో పాటు ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని కూడా గురుకులాల ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.
స్థలాలు కొన్ని ఓకే.. మరి కొన్నిచోట్ల అన్వేషణ..
కొత్తగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు స్కూళ్లు మంజూరయ్యాయి. కొత్తగూడెంలో రెసిడెన్షియల్ స్కూల్ కోసం సింగరేణి హెడ్ ఆఫీస్ సమీపంలో 21 ఎకరాలను గుర్తించారు. ఇల్లెందులో ఆర్ అండ్ ఆర్ కాలనీ సమీపంలో 20 ఎకరాలను స్కూల్ కోసం పరిశీలిస్తున్నారు. సత్తుపల్లిలో స్కూల్ కోసం స్థలాన్ని ఇంత వరకు గుర్తించలేదు. కల్లూరు మండలంలో అనువుగా ఉండే ప్రభుత్వ స్థలం కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. వైరా నియోజకవర్గంలో పెద్ద స్థలం లేకపోవడంతో ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు. ప్రస్తుతం వైరాలో రెండు రెసిడెన్షియల్ స్కూల్లు పక్కపక్కనే ఉండడం, ఆ భవనాలు పురాతన దశకు చేరడంతో వాటిని తొలగించి అదే ప్లేస్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవనాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారు.