15 లేదా 16న గురుకుల స్టూడెంట్లతో సీఎం, మంత్రుల లంచ్: డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: డైట్ చార్జీలు పెంచిన అంశాన్ని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గురుకుల స్టూడెంట్లతో పంచుకోనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 15 లేదా 16న గురుకుల స్టూడెంట్లతో కలిసి సీఎం రేవంత్  రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు లంచ్  చేస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం గురుకల స్టూడెంట్లను పట్టించుకోలేదని, గురుకులాలను అద్దె భవనాల్లో కొనసాగించాయని ఆయన విమర్శించారు. కనీసం డైట్, కాస్మెటిక్  చార్జీలు కూడా పెంచకుండా వివక్ష చూపించారని ఫైర్  అయ్యారు.

సోమవారం అసెంబ్లీ లాబీలో తన చాంబర్ లో మీడియాతో భట్టి చిట్ చాట్  చేశారు. తమ ప్రభుత్వం అధికారులు ఇచ్చిన రిపోర్ట్  ప్రకారం సుమారు 40 శాతం డైట్, కాస్మెటిక్  చార్జీలు పెంచిందని గుర్తుచేశారు. ఇప్పటి నుంచి ఉన్నతాధికారులు కూడా గురుకులాల్లో పర్యటించి, అక్కడి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా గురుకుల విద్యార్థులతో లంచ్  కార్యక్రమం ఏర్పాటు  చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది రూ.5 వేల కోట్లకుపైగా నిధులతో ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  హాస్టల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.