ఉద్యోగులకు గంపగుత్తగా ప్యాకేజీ ప్రకటించనున్న సీఎం!

రిటైర్మెంట్ ఏజ్​ 60 ఏండ్లకు పెంచే చాన్స్​

ఏటా రూ. 10 వేల ట్రావెల్ అలవెన్స్

సీపీఎస్​ పరిధిలోని వాళ్లకు రూ. 5 లక్షల నుంచి 10 లక్షల దాక గ్రాట్యుటీ
ఏప్రిల్​ 1 నుంచి లేదా జూన్ 2 నుంచి అమల్లోకి రానున్న హామీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకేసారి గంపగుత్తగా ప్యాకేజీ ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఫిట్​మెంట్​ కొంచెం అటూ ఇటైనా మిగతా సమస్యలను పరిష్కరిస్తే ఎంప్లాయీస్​లో వ్యతిరేకత తగ్గొచ్చని అంచనా వేస్తోంది. ప్యాకేజీని ఈ నెలాఖరున సీఎం కేసీఆర్​ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమోషన్లపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. మిగతా సమస్యలను ఏ మేరకు పరిష్కరించవచ్చో ఆరా తీస్తోంది. రెండున్నరేండ్లుగా ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయలేదు. కమిషన్  తన రిపోర్టును అందజేయడానికి చాలా టైం తీసుకుంది. పదిరోజుల కింద ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్ తో ఉద్యోగ సంఘాల నేతల లంచ్ మీటింగ్ తర్వాత పీఆర్సీ రిపోర్టుకు మోక్షం కలిగింది. డిసెంబర్ 31న కమిషన్ తన రిపోర్టును సీఎస్ సోమేశ్ కుమార్ కు అందించింది. ప్రస్తుతం ఆ రిపోర్టు ప్రగతిభవన్​కు చేరుకుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను పీఆర్సీ సిఫారసులతో సంబంధం లేకుండానే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎస్  భేటీ కానున్నారు. ఇందులో ప్రభుత్వ ప్రతిపాదనలు వివరించడమే తప్ప.. ఉద్యోగ సంఘాల నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునే చాన్స్ తక్కువని ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు.

నెగెటివ్ రాకుండా ఉండేందుకే..

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి టైమ్​లో ఫిట్​మెంట్​ తక్కువగా ప్రకటిస్తే ఆ కోపానికి మరింత ఆజ్యం పోసినట్టు అవుతుందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరిస్తూ ఫిట్​మెంట్ ప్రకటిస్తే ఇబ్బంది ఉండదనుకుంటోంది. అందులో భాగంగానే  ఉద్యోగులు కోరుకుంటున్న ప్రమోషన్ల ప్రాసెస్​ను ప్రారంభించినట్లు ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​ వివరించారు. గతంలో ప్రతి ఎంప్లాయ్​ ఏడాదికోసారి ట్రావెల్ అలవెన్సులు పొందేవారు. కొన్నేండ్లుగా అలవెన్సులు ఇవ్వడంలో జాప్యంతోపాటు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇప్పటి నుంచి ఏటా రూ. 10 వేల వరకు ట్రావెల్ అలవెన్సుగా ఇస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆరా తీస్తోంది. మరోవైపు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ ఉన్నా.. అది సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. సీపీఎస్  పరిధిలోని ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున కొంత అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పించేలా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. గ్రాట్యుటీ రూ. 25 లక్షలు ఇవ్వాలని సీపీఎస్​ పరిధిలోని ఉద్యోగులు అడుగుతున్నారు.  రూ. 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

రిటైర్మెంట్ ​ఏజ్​ 60 ఏండ్లు!

2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్​ను 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతామని టీఆర్​ఎస్​ హామీ ఇచ్చింది. ఇంతవరకు అది అమలులోకి రాలేదు. ఫిట్​మెంట్ ప్రకటించే టైంలోనే రిటైర్మెంట్​ ఏజ్​ పెంపును అమలు చేయాలని  ప్రభుత్వం ఆలోచిస్తున్నది.  ఏపీలో రిటైర్మెంట్ వయసు 60 ఏండ్లకు పెంచారు. ఇక్కడ కూడా 60 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రతి నెల దాదాపు 400 నుంచి 500 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుంటారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఏటా దాదాపు రూ. 2,500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ఏజ్ పెంపు వల్ల రెండేండ్ల తర్వాత బెనిఫిట్స్ చెల్లించే  వెసులుబాటు ప్రభుత్వానికి దక్కుతుంది.

బెనిఫిట్స్ ఏప్రిల్​ 1 నుంచి లేదా జూన్ 2 నుంచి!

ప్రభుత్వం ప్రకటించే అన్ని ప్రయోజనాలు వచ్చే ఫైనాన్షియల్​ ఇయర్​స్టార్టింగ్​లో (ఏప్రిల్​ 1 నుంచి) లేదా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి అమలు చేసే చాన్స్​ ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పీఆర్సీ అమలు, రిటైర్మెంట్​ ఏజ్​ పెంపు, ట్రావెల్ అలవెన్స్ తో పాటు ఇతర హామీల అమలు జీవోలు మాత్రం ఈ నెలాఖరుకు విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నాయి. గతంలోనూ పీఆర్సీని 2014లో జూన్ 2 నుంచి అమలు చేశారని, ఇప్పుడూ అలాగే ఇంప్లిమెంట్ చేయొచ్చని, లేదా ఏప్రిల్​ 1 నుంచి అమలు చేయొచ్చని ఓ ఆఫీసర్​ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్​లో  జీతాలు పెంచడానికి ఆర్థిక వనరుల కొరత ఉందని,  వచ్చే బడ్జెట్ లోనే ఫిట్​మెంట్ అమలు చేయాలని సీఎం భావిస్తున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి.

30 శాతానికి అటూ ఇటుగా ఫిట్​మెంట్​

ఉద్యోగులు చాలా ఆశగా ఎదురుచూస్తున్న ఫిట్​మెంట్​పై ప్రభుత్వంలో డిస్కషన్స్​ ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న 43 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. 20 శాతం లోపు ప్రకటిస్తే ఉద్యోగులు ఒప్పుకోరన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తమ ఉద్యోగులకు  27 శాతం ఐఆర్ చెల్లిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 30 శాతానికి అటూ ఇటుగా ఫిట్​మెంట్​ ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

నేడు కలెక్టర్లతో సీఎం మీటింగ్

జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో సోమవారం సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్ లో మీటింగ్ స్టార్ట్ కానుంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, హెల్త్​, ఎడ్యుకేషన్​, ఫారెస్ట్​ శాఖలతోపాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించి సీఎం నిర్ణయాలు తీసుకుంటారు. కరోనా వ్యాక్సినేషన్, స్కూళ్ల ఓపెనింగ్‌‌‌‌పై కలెక్టర్లకు సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీల్లో క్లాస్​లను  ఎప్పటి నుంచి  ప్రారంభించాలనే అంశంపై చర్చిస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యునళ్ల ఏర్పాటుపైనా డిస్కస్​ చేయనున్నారు.