- ఎమ్మెల్యేలకు సీఎం హామీ
పాలమూరు/జడ్చర్ల టౌన్, వెలుగు: పాలమూరును ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతానని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో కొత్తగా ఏర్పాటు చేయనున్న లా, ఇంజనీరింగ్ కాలేజీలకు రెండు రోజుల కింద కేబినెట్లో ఆమోదం లభించింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి క్లాస్లెస్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ నేపథ్యంలో పాలమూరు, జడ్చర్ల ఎమ్యెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్ ఆదివారం ఉదయం సీఎంను హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ కార్యక్రమం నవరత్నాలు గురించి సీఎంకు వివరించారు. గవర్నమెంట్ కాలేజీలో చదివే 200 మంది స్టూడెంట్లకు ఏటా ఫ్రీగా నీట్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కోసం శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల ను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని, బాలానగర్ ను మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. జడ్చర్లకు రైలు, రోడ్డు వసతులు ఉన్నాయని, జనాభా 4.5 లక్షల వరకు ఉందని తెలిపారు.ఈ విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన రెవెన్యూ డివిజన్లు, మండలాల గురించి ఒక కమిటీ వేస్తామని, ఆ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.