- లోన్ల కోసం ఫైనాన్స్ సంస్థలతో మాట్లాడండి
- అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
- 17 రోజుల తర్వాత ఫామ్‌హౌస్ నుంచి ప్రగతిభవన్‌కు రాక
- నేడు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించే చాన్స్.. రేపు ప్రెస్‌మీట్?
హైదరాబాద్, వెలుగు: లోన్లు ఇచ్చేందుకు కేంద్రం నిబంధనలు పెడ్తున్నందున ప్రాజెక్టుల నిర్మాణంపై ఏం చేద్దామని సీఎం కేసీఆర్ అధికారులను ఆరా తీశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, వానాకాలం సీజన్‌కు సన్నద్ధతపై సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ఆయన సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని సాకుగా చూపించి కాళేశ్వరం, వాటర్ రీసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లకు లోన్లు రాకుండా అడ్డుగా నిలుస్తున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయా కార్పొరేషన్లతో లోన్లు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్న ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న పతారను, ఇప్పటికే తీసుకున్న లోన్ల రీపేమెంట్లు ఎంత టంచన్‌గా చేస్తున్నది, ఇతర అంశాలను ఆయా సంస్థలకు వివరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ నుంచి క్లియరెన్స్ వచ్చేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నామని తెలిపారు. అప్పులపై ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఆయకట్టు పెంచేందుకు ఉన్న అడ్డంకులేమిటో చెప్పాలని అధికారులను సీఎం ఆరా తీశారు. రంగనాయకసాగర్ సమస్యలు, పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యలు ఏమిటన్నదానిపై చర్చించినట్టు తెలిసింది. ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి అవసరమైన భూసేకరణకు వెంటనే చర్యలు చేపడుతామన్నారు. జిల్లా కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలతో కలిసి భూసేకరణకు ఉన్న అడ్డంకులపై చర్చించాలని చెప్పారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లిస్తామని నచ్చజెప్పి పనులు చేయించాలని సూచించినట్లు తెలిసింది. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ పనులన్నీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. ఇంకో నెలకు పైగా టైం ఉండటంతో ప్రాజెక్టుల ప్రధాన కాల్వలకు చేపట్టాల్సిన రిపేర్లు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుల కాల్వలతో చెరువులకు లింక్ చేయాల్సిన ఓటీలు (తూములు), కాల్వల్లో పూడిక తొలగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. పాలమూరు –- రంగారెడ్డి పంపుహౌస్‌ల నిర్మాణంపై ఫోకస్ చేయాలని, పంపులు, మోటార్ల ఏర్పాటుకు అవసరమైన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. సీతారామ ఎత్తిపోతలు, సమ్మక్క సాగర్ బ్యారేజీ, మోడికుంట వాగు, గూడెం ఎత్తిపోతలకు అనుమతులు తుది దశలో ఉన్నందున సీడబ్ల్యూసీ తో సంప్రదించి క్లియరెన్స్‌లు తేవాలని అదేశించినట్టు సమాచారం.