మ్యాజిక్ ఫిగర్‌ను దాటుతం : బొమ్మై
యడియూరప్ప ఇంట్లో ముఖ్య నేతల భేటీ
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి మెజారిటీ సాధించి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం బసవరాజు బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. తమకే క్లియర్ మెజారిటీ వస్తున్నప్పుడు ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. శుక్రవారం సీఎం బొమ్మై, మంత్రులు మురుగేశ్ నిరాణి, బైరాథి బసవరాజ్, ఎంపీ లెహర్ సింగ్ సిరోయాతో పాటు ఏటీ రామస్వామి, పార్టీ ముఖ్య నేతలతో కలిసి మాజీ సీఎం యడియూరప్పతో ఆయన ఇంట్లో భేటీ అయ్యారు.
చర్చల అనంతరం సీఎం బొమ్మై మీడియాతో మాట్లాడారు. ‘‘మాకు పూర్తి మెజారిటీ వస్తుందని నమ్మకంగా ఉన్నాం. అన్ని నియోజకవర్గాలు, జిల్లాల నుంచి గ్రౌండ్ రిపోర్ట్‌ను తెప్పించుకున్నాం. వాటిని చూశాక మేము మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటామని నమ్మకంతో ఉన్నాం” అని బొమ్మై పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ నేతలను తరలించడానికి ఇప్పటికే రిసార్ట్‌లను బుక్ చేసిందన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. వాళ్లకు పూర్తి మెజారిటీ రాదని, అందుకే కాంగ్రెస్ ఇతర పార్టీలతో టచ్‌లో ఉంటూ, రిసార్ట్‌లు బుక్ చేశారన్నారు. వారి ఎమ్మెల్యేలపైన వారికే నమ్మకంలేదని విమర్శించారు. తమ కండిషన్లు నెరవేర్చే పార్టీతో కలవడానికి సిద్ధంగా ఉన్నామని జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఇచ్చిన స్టేట్‌మెంట్ గురించి అడగగా, దాని గురించి తాను వినలేదని బొమ్మై చెప్పారు.