అన్ని పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం పెట్టాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరింది. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అన్ని పాఠశాలల్లో ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ, విద్యాశాఖాధికారుల నిర్ణయాన్ని బాలల హక్కుల సంక్షేమ సంఘం తప్పు పడుతున్నది. ముందుగా దసరా పండుగ రోజు అక్టోబరు 24 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించి.. ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఆదర బాదరగా అక్టోబర్ 6న ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది.
అనంతరం అక్టోబరు 13 నుంచి 25 వరకు అన్ని పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చారు. దాదాపు 13 రోజులపాటు నిద్రపోయిన విద్యాశాఖ అధికారులు ఈ సెలవుల కాలంలో పథకానికి సంబంధించిన ఎటువంటి విధి విధానాలు రూపొందించలేదు. దసరా సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం రోజున అంటే అక్టోబరు 26 నుంచి అన్ని స్కూల్స్ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ అమలు చేయాల్సి ఉంది. కానీ, దశల వారీగా పథకాన్ని అమలు చేయాలనే నిర్ణయం అధికారుల అసమర్థతను, అలసత్వాన్ని తేటతెల్లం చేస్తున్నది.
తమిళనాడు ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా ప్రాథమిక స్థాయి వరకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నతస్థాయి అధికారుల బృందాన్ని పథకం పరిశీలన కోసం తమిళనాడుకు పంపింది. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను పరిశీలించిన అధికారుల బృందం సీఎం కేసీఆర్‌కు నివేదికను అందజేసింది. కాగా, బాలల హక్కుల సంక్షేమ సంఘం గత దశాబ్ద కాలంగా చేస్తున్న పోరాటాల ఫలితంగా నైతెనేమి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అయితేనేమి పథకం అమలు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది.
విద్యాశాఖలో నిర్లిప్తత
దసరా నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానికి సీఎం బ్రేక్ ఫాస్ట్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే త్వరలోనే ఎన్నికల షెడ్యూలు వస్తుందని బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ముందుగానే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా నియోజకవర్గానికి ఒకటి, రెండు పాఠశాలల్లోనే ప్రారంభిస్తామన్నారు.
అనంతరం మండలానికో పాఠశాలలో ప్రారంభిస్తామని 13 నుంచి దసరా సెలవులు ఇచ్చేశారు. సెలవుల అనంతరం అనగా ఈ నెల 26 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రారంభించాల్సి ఉండగా.. వారం రోజుల తర్వాత మండలంలోని రెండవ పాఠశాలలో ప్రారంభిస్తామని, ఇలా దశలవారీగా ప్రతి వారం అదనంగా ఒక్కో స్కూల్లో ప్రారంభిస్తూ మండలంలోని అన్ని పాఠశాలలకు విస్తరిస్తాం అని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కానీ, స్పష్టమైన విధి విధానాలు ఇప్పటికీ ప్రకటించకపోవడం విద్యాశాఖ అధికారుల నిర్లిప్తతను తెలుపుతున్నది.
బిల్లుల చెల్లింపులు లేవు
అక్టోబర్ 6 నుంచి 12 వరకు అల్పాహారం వడ్డించిన ప్రధానోపాధ్యాయులకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. మధ్యాహ్న భోజనం వండి పెట్టే ఏజెన్సీలకు కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించని కారణంగా వాళ్లు ఆందోళన బాటపట్టారు. బ్రేక్ ఫాస్ట్ మేం వండి పెట్టలేం అంటున్నారు. ఎన్నికల కోలాహలంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఈ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని నీరుగార్చేలా ఉన్నట్లు అనిపిస్తున్నది. విద్యార్ధులకు ఓటుహక్కు లేకపోవచ్చు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ ఓటర్లే అని నాయకులు విస్మరించకూడదు..
క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి తనశాఖ అధికారులతో వెంటనే సమీక్షా సమావేశం నిర్వహించాలి. దశల వారీగా కాకుండా అన్ని పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రవేశ పెట్టాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం(బిహెచ్ఎస్ఎస్) డిమాండ్ చేస్తున్నది.
- ఇ. రఘునందన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
బాలల హక్కుల సంక్షేమ సంఘం (బిహెచ్ఎస్ఎస్)