హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో అధునాతన వసతులతో సీఎం క్యాంప్ ఆఫీసు సిద్ధమవుతోంది. ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ 1 భవనంగా దీనిని నిర్మిస్తున్నారు. మంత్రులు, సీనియర్ అధికారులతో సీఎం అత్యవసర సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఈ భవనం రూపుదిద్దుకుంటోంది. జీ ప్లస్ 1 ప్లాన్ లో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఇందులో సమావేశపు హాలు, నాలుగు సూట్లు, వంటగది ఉంటుంది. తక్కువ నిర్మాణ వ్యయంలో పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి సూచనల మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఈ క్యాంప్ ఆఫీసును నిర్మింపజేస్తున్నారు. వచ్చే 3-4 నెలల్లో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు.
ఆరు నెలలుగా ఇంటి నుంచే
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారిక, అనధికారిక సమావేశాలు అక్కడే నిర్వహిస్తున్నారు. సచివాలయంలో అధికారులతో రేవంత్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 12లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల రుణమాఫీ పథకంపై అధికారులు, మంత్రులతో సీఎం రివ్యూ చేశారు. సీఎం నివాసానికి కేవలం 2 కి.మీ.ల దూరంలోనే ఉన్నందున, కార్యాలయ సమయాల్లో ట్రాఫిక్ నిలిచిపోవాల్సిన అవసరం ఉండదని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని క్యాంపు కార్యాలయానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇన్‌స్టిట్యూట్‌లో హెలిప్యాడ్ కూడా ఉంది, ఇతర ప్రాంతాల నుంచి నేరుగా అక్కడ దిగాలనుకున్నా అదీ ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు సిఎంలు ఇన్స్టిట్యూట్‌లో గతంలో అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించారని, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో, కొత్త సచివాలయం నిర్మాణంలో ఉన్నప్పుడు ఈ భవన సముదాయం కీలక సమావేశాలకు ఉపయోగపడింది. ఈ భవనం పూర్తయితే ఎంసీహెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ కార్యాలయం కొనసాగుతుంది.