ఏపీలో జూలై 8వ తేదీ నుంచి ఫ్రీగా ఇసుక

అమరావతి, వెలుగు: ఏపీ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 8 నుంచి ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తామని బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం ఆదేశాలిచ్చారు. 2019కి ముందు తాము అమలు చేసిన విధానాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నామని సీఎం ప్రకటించారు.

ఉచిత ఇసుక విధానంతోపాటు గతంలో జరిగిన పొరపాట్లు, ఇతర అంశాలపైనా గనుల శాఖ అధికారులతో సెక్రటెరియెట్​లో బాబు సమీక్ష జరిపారు. ఈ పథకానికి సంబంధించి కలెక్టర్ల అధ్యక్షతన వేసిన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా చార్జీలను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ఇసుక రీచ్‌‌లు, స్టాక్‌‌పాయింట్లు, డంప్‌‌ల పరిధిలో ఉన్న ఇసుక వివరాలను అధికారులను అడిగి  చంద్రబాబు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు నివేదించారు. ఇకపై ఆన్‌‌లైన్‌‌ ద్వారానే బుకింగ్‌‌ చేసుకునే విధానం తీసుకురావాలని అధికారులకు తేల్చిచెప్పారు.