
- నేను కాళేశ్వరం ప్రాజెక్టును వద్దనలేదే?
- తెలంగాణలో ఇంకా ప్రాజెక్టులు కట్టుకోండి
- మిగిలిపోయి కిందకొచ్చిన నీళ్లనే తాము వాడుకుంటామన్న ఏపీ సీఎం
హైదరాబాద్, వెలుగు:పోలవరం నుంచి గోదావరి నీళ్లను బనకచర్లకు తీసుకెళితే తప్పేంటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవన్నీ సముద్రంలోకి వృథాగా పోయే నీళ్లు అని, వీటిపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తాను వ్యతిరేకించలేదని, అవసరమైతే మరిన్ని ప్రాజెక్టులు కూడా కట్టుకుని నీటిని నిల్వ చేసుకోవచ్చని చెప్పారు. మంగళవారం ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత మంగళగిరిలోని పార్టీ హెడ్ ఆఫీసులో జరిగిన విజయోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడారు.
‘‘నిన్నా మొన్నా ఇంకో విషయం గురించి మాట్లాడుతున్నారు. తెలుగుజాతికి, తెలంగాణలో ఉండేవాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. సముద్రంలోకి వృథాగా పోయే నీళ్లను సద్వినియోగం చేసుకుందామంటే కొందరు రాజకీయం చేస్తున్నరు. ఒక పార్టీ రాజకీయం చేస్తే తాము వెనకబడిపోతామని మరో పార్టీ వాళ్లు మాట్లాడుతున్నరు. ఇది మంచిది కాదు. రాజమండ్రి దాటితే ఆ నీళ్లు సముద్రంలోకి పోతాయి. ఎవరికీ ఉపయోగం ఉండదు.
ఈ నీటిని తీసుకెళ్తానని అంటే ఆ రైట్ ఎక్కడుందని ఆలోచిస్తుంటే మనం ఎక్కడికి పోతున్నాం? ఇటీవల తెలంగాణ, కర్నాటక, మహారష్ట్రలో వర్షాలు కురిస్తే.. ఆ నీళ్లను నిలుపుకునేందుకు ప్రాజెక్టులు లేకపోవడంతో వరద నీళ్లు కిందకు వచ్చి విజయవాడ కూడా ముంపునకు గురయింది” అని ఆయన అన్నారు.
గోదావరిపై ప్రాజెక్టులు కట్టుకోండి..
తనకు ఏపీ, తెలంగాణ రెండూ రెండు కండ్ల వంటివని, రెండు రాష్ట్రాలకూ సమన్యాయం చేయాలని రాష్ట్ర విభజన నాటి నుంచీ చెప్తున్నానని చంద్రబాబు తెలిపారు. “ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గోదావరిపై మీరు ప్రాజెక్టులు కట్టుకోండి. నీళ్లు తీసుకోండి. గోదావరి ఒక్కటే తెలుగు జాతికి శ్రీరామరక్ష. వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోతుంటే.. వాటిని వాడుకుంటే తప్పెలా అవుతుంది?” అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకుపోతే ఎవరూ బాధపడక్కర్లేదు.
కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు. చాలా మంచి పనిచేశారు. ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి. అక్కడి నుంచి మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తాయి. రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది. ఆ తర్వాత సముద్రంలోకే పోతాయి. అందుకే దిగువ రాష్ట్రానికి ఎప్పుడూ అధికారం ఉంటుంది. అలాంటి నీళ్లు వాడుకుంటున్నాం అదేమీ తప్పు కాదు కదా. ఇది అందరికీ లాభం. మనం ఈ నీళ్లు తీసుకుపోతే రేపు అవసరమైతే ఇంకొక 20, 30 టీఎంసీలు వాళ్లు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది” అని చంద్రబాబు వివరించారు.
‘‘గంగ, కావేరి నదులను కూడా అనుసంధానం చేయాలి. దీనిపై మోదీ కంటే ముందు అప్పటి ప్రధాని వాజ్ పేయి టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. రాజకీయ నాయకులకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. నేడు మోదీ ఉన్నారు. ఆయన దేశాన్ని నడిపిస్తే.. తెలుగుజాతిని అగ్రస్థానం దిశగా నేను నడిపిస్తా” అని ఆయన చెప్పారు.