జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించానని..వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని అన్నారు. జమిలి అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది 2029లోనేనని అన్నారు. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని.. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు చంద్రబాబు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలని అన్నారు.విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని.. గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికి కనిపిస్తున్నాయని అన్నారు చంద్రబాబు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని.. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదని అన్నారు.భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలని.. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047 అని అన్నారు.
Also Read :- నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా
సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని, ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామని అన్నారు.సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు, సమాధానాల రూపంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని.. అద్వానీతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని అన్నారు.
అప్పట్లో ఏపీ అభివృద్ధిలో అద్వానీ సహకారం మరువలేనిదని అన్నారు.