
కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన త్రిభాషా సూత్రంపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.భాష అనేది కమ్యూనికేషన్ కోసం ఉద్దేశించిన సాధనమని అన్నారు చంద్రబాబు. మాతృభాషతో పాటు అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ ను, దేశంలో ఎక్కువమంది మాట్లాడే హిందీని నేర్చుకుంటే తప్పేంటని అన్నారు చంద్రబాబు. జ్ఞానాన్ని సంపాదించడం మాతృభాష ద్వారానే సాధ్యమవుతుందని నమ్ముతానన్న చంద్రబాబు ఇతర భాషలు కూడా నేర్చుకోవడంలో తప్పు లేదని అన్నారు.
ఇదిలా ఉండగా డీలిమిటేషన్ పై కూడా స్పందించిన చంద్రబాబు.. తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించారు. దేశ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ ఎంతో అవసరమని.. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన కూడా దేశప్రయోజనాల కోసమేనని అన్నారు చంద్రబాబు.
నియోజకవర్గ పునర్విభజన అత్యవసరమని... దేశంలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై చర్చను తొలిసారి తానే ప్రారంభించానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. సరిహద్దు నిర్ధారణ నిరంతర ప్రక్రియ అని.. ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని అన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని, సరిహద్దు విభజన, జనాభా నిర్వహణ భిన్నమైనవని అన్న చంద్రబాబు స్టాలిన్ వైఖరిని ఖండించారు.