తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు.. అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించారు.
ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా నిలదీశారు. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంకు జిల్లా అధికారులు వివరించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీబీఎన్ ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలని సూచించారు. రేపు (జవనరి 9) ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు.
తిరుమలలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం బుధవారం (జనవరి 8) భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరిని ఒకరిని తమిళనాడు సేలంకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. విష్ణునివాసం వద్ద టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురం పార్క్ ప్రాంతాల్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.