ఇంద్రకీలాద్రికి సీఎం.. దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.  కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకుని  మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు చంద్రబాబు కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం అనంతరం మధ్యాహ్నాం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.    సీఎంగా విజయవాడకు వచ్చిన సందర్భంగా తొలిసారి గన్నవరం ఎయిర్‌పోర్టులో టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు , దేవదాయ శాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఆలయ ఈవో తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రి దర్శనం  అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన  నివాసానికి బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.