ఆంధ్రప్రదేశ్ సీఎంగా నాలుగవ సారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే పోలవరంపై సమీక్ష నిర్వహించారు. సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పోలవరాన్ని సందర్శించారు చంద్రబాబు. 2014 నుండి 19 వరకు బాబు హయాంలో లాగే ఇప్పుడు కూడా పోలవరాన్ని సందర్శించిన చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, కాఫర్ డ్యామ్, పవర్ హౌస్ లను పరిశీలించిన చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.డయాఫ్రామ్ వాల్ 35శాతం డ్యామేజ్ అయ్యిందని, గత ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ను కాపాడలేకపోయిందని అన్నారు. 550కోట్ల రూపాయలతో రెండు కాఫర్ డ్యామ్ లను నిర్మించారని, కాఫర్ డ్యామ్ ల మధ్య గ్యాప్ ని పూడ్చలేకపోయారని అన్నారు.గత ప్రభుత్వం పనులను కొనసాగించి ఉంటే పోలవరం 2020లోనే పూర్తయ్యేదని అన్నారు. ఒక వ్యక్తి రాష్ట్రానికే శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.
గతంలో సీఎంగా ప్రమాణం చేయకముందే 7మండలాలను రాష్ట్రంలో కల్పగలిగామని, 7మండలాలను కలపాలని ఒత్తిడి తెచ్చి మరీ కలిపాం కాబట్టే పోలవరం కట్టగలిగామని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోభాలను ఎదుర్కొందని అన్నారు. తమ హయాంలో పోలవరాన్ని 72శాతం పూర్తి చేశామని, గత ప్రభుత్వం పోలవరాన్ని సంక్లిష్టంగా మార్చేసిందని అన్నారు.
పోలవరం విషయంలో జగన్ సర్కార్ క్షమించరాని తప్పు చేసిందని మండిపడ్డారు. అస్తవ్యస్త పనుల వల్లే కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందని, రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు నిర్వీర్యం అయ్యిందని అన్నారు. రోజురోజుకీ ప్రాజెక్టు వ్యయం పెరుగుతూనే ఉందని, ప్రాజెక్టుకు నష్టం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ఐదేళ్ళలో పోలవరంపై జగన్ ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టారా అని ప్రశ్నించారు చంద్రబాబు.