అమరావతి: జగన్ ప్రభుత్వ హయాంలో భారీ భూదందాలు జరిగాయని, సహజ వనరుల దుర్వినియోగం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆయన కొన్ని శ్వేతపత్రాలను విడుదల చేశారు. భూదందాలు ఏ స్థాయిలో జరిగాయో ప్రజలు గమనించాలని జిల్లాల వారీగా డేటాను చంద్రబాబు బయటపెట్టారు. 2019- నుంచి 2024 వరకూ భూదందాలు భారీగా జరిగాయని.. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అర్బన్ ల్యాండ్స్ ను వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిన దోచుకుందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇళ్ల స్థలాల పట్టాల పేరుతో, వైసీపీ కార్యాలయాల నిర్మాణాల పేరుతో జగన్ ప్రభుత్వం భూదందాలకు పాల్పడిందని ఆయన వివరించారు.
ALSO READ | ఏపీలో ఇసుక అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా...
అనర్హులకు భూ కేటాయింపులు చేసి, పేదలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన భూములను వైసీపీ నేతలకు దోచిపెట్టి జగన్ సర్కార్ అవినీతికి పాల్పడిందని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. విశాఖపట్నంలో రూ.4469 కోట్లు, ఒంగోలులో రూ.101 కోట్లు, తిరుపతిలో 270 కోట్లు, చిత్తూరులో రూ.99 కోట్ల విలువైన భూములను వైసీపీ అధికారంలో ఉండగా దోచుకుందని సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేసి మరీ వివరించారు. పోలవరం, విద్యుత్, అమరావతిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.