హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాళాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఫీల్డ్‌లో హైడ్రా దూకుడుగా పని చేస్తోంది. ప్రభుత్వ భూమి, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను తన, మన.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ నేల మట్టం చేస్తోంది. దీంతో హైడ్రా పేరు వింటనే అక్రమార్కులు గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ క్షణాన హైడ్రా అధికారుల వచ్చి తమ అక్రమ కట్టడాలను కూల్చివేస్తారోనని బిక్కుబిక్కుమంటున్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హైడ్రా వ్యవస్థ పట్ల కొంత వ్యతిరేకత ఎదురైనా మెజార్టీ వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. దీంతో హైడ్రాను జిల్లాలో కూడా విస్తరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థపై పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి అక్రమణలకు గురైన బుడమేరు వాగు ఆక్రమణలు తొలగిస్తామని అన్నారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని అక్రమ నిర్మాణదారులకు వార్నింగ్ ఇచ్చారు.
ఈ మేరకు త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపట్టి.. అక్రమణలను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపునకు పటిష్ట చట్టం ఏర్పాటు చేస్తామని తెలిపారు. బుడమేరు ఆక్రమణలను ఉపేక్షించే ప్రశ్నే లేదని.. విజయవాడకు మొన్నటి పరిస్థితి మళ్లీ రాకూడదన్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. బుడమేరు విజృంభణతో విజయవాడ నగరమంతా జలమైంది. వందల ఇళ్లు నీటమునిగాయి. పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకోగా.. చాలా మంది నీటిలో గల్లంతయ్యారు. బుడమేరు ఉగ్రరూపానికి విజయవాడ నామరూపాలు మొత్తం మారిపోయాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి.
వర్షం, వరదలు తగ్గి నాలుగైదు రోజులు గడుస్తోన్న ఇప్పటికీ విజయవాడలో వరద నీరు అలాగే ఉంది. ఇప్పటికీ సహయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ విషాదానికి కారణం బుడమేరు అక్రమణే. బుడమేరు వాగును అక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడంతో వాగు విస్తీరణం తగ్గింది. ఈ క్రమంలోనే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు వరద పొటెత్తింది. దీంతో వరద నీరు ఇళ్ల మధ్య చేరి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు సర్కార్.. హైడ్రా వంటి వ్యవస్థను తీసుకొచ్చి బుడమేరుకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించింది.