ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే వరుస సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న అమరావతి, పోలవరం, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. తాజాగా మరో కీలక శాఖపై శ్వేతపత్రం విడుదలకు సీఎం చంద్రబాబు డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆర్థికశాఖకు సంబంధించి రాష్ట్ర ఆదాయం, అప్పులపై ఈ నెల 18న శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఏపీకి 14లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు సమీక్షలో అధికారులు చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు,రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధుల కేటాయింపులపై కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిచారు. కేంద్ర నిధులపై నిత్యం ఆయా కేంద్ర మంత్రిత్వశాఖలతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. గత ప్రభుత్వం నిర్వాకంతో.. రాష్ట్రం ఏవిధంగా దెబ్బతిందో ప్రజలకు వివరించేలా శ్వేతపత్రం రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.