శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడంలో సీఎం చంద్రబాబు రికార్డ్

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడంలో సీఎం చంద్రబాబు రికార్డ్

అమరావతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన (అక్టోబర్ 4) శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వం తరుఫున బంగారు పళ్లెంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తద్వారా అధిక సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు రికార్డ్ సృష్టించారు. ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు.. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. 

టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌ట‌ చౌద‌రి సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత సీఎం చంద్రబాబు ధ్వజస్తంభానికి నమస్కరించుకుని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ ఈఓ ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

ALSO READ | తిరుమల బ్రహ్మోత్సవాలు : శ్రీవారికి తొలి నైవేద్యంగా దోసెలు, వడలు..!