అమరావతి: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వరద బాధితులకు ఆర్థిక సహయం, నష్ట పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బుధవారం ఏలూరు జిల్లాలో పర్యటించిన బాబు.. స్థానిక సీఆర్ రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 17 లోపు వరద బాధితులకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు వరికి ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని ప్రకటించారు.
ఉప్పుటేరు, ఎర్రకాలువ వరదలను నివారించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతిష్టాత్మంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్ట్ తో నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చుతామని అన్నారు. జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ను కూడా గత వైసీపీ ప్రభుత్వం ముంచేసింది.. ఇప్పుడు మేం అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేసి తీరుతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పోలవరానికి రూ.12 వేల కోట్లు వచ్చేలా చేశానన్నారు.
కాగా, ఇటీవల ఏపీని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బుడమేరు వాగు విజృభించడంతో విజయవాడ నగరం అల్లకల్లోలం అయ్యింది. విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగి నదులను తలపించాయి. ఇళ్లలోని వస్తువులు, వాహనాలు, సామాగ్రి అంతా నీటి పాలై వందల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే వరదల వల్ల సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహయం చేస్తోంది.