- ఎలక్షన్ కమిషన్‌కు సీఎం చన్నీ లెటర్
చండీగఢ్: ఫిబ్రవరి 14న పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్‌ను ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కోరారు. ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎలక్షన్స్‌ను ఆరు రోజుల పాటు వాయిదా వేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్రకు జనవరి 13న చన్నీ లేఖ రాశారు. పంజాబ్‌లో 32 శాతం మంది ఎస్సీలు ఉన్నారని, గురు రవిదాస్ జయంతి సందర్భంగా దాదాపు 20 లక్షల మంది ఎస్సీ భక్తులు ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌ను సందర్శిస్తారని చెప్పారు. దీంతో చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉండదని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఎన్నికలను వారం రోజులు వాయిదా వేసి, రాజ్యాంగం వారికి కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇదివరకే పంజాబ్ బీఎస్సీ చీఫ్ జస్వీర్ సింగ్ గర్హి ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు.
ఇండిపెండెంట్‌గా చన్నీ తమ్ముడు పోటీ
- కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో నిర్ణయం
పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తమ్ముడు మనోహర్ సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఫిబ్రవరిలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బస్సీ పఠనా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. అయితే మనోహర్ ప్రకటనపై సీఎం చన్నీ ఇంతవరకు స్పందించలేదు. కాంగ్రెస్‌లో ‘‘వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్” రూల్ ఉన్నందున మనోహర్‌కు ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 86 మంది అభ్యర్థులతో ఫస్ట్ జాబితాను కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. బస్సీ పఠానా టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ సింగ్‌కు ఇచ్చారు. ‘‘బస్సీ పఠానా ప్రజలు నన్ను ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు పోటీపై వెనక్కి తగ్గలేను. ఎట్టిపరిస్థితుల్లో పోటీ చేస్తా. గెలుస్తా”అని మనోహర్ సింగ్ స్పష్టం చేశారు.