భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : క్రీడా తెలంగాణను రూపొందించే లక్ష్యంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. సీఎం కప్ క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడా జ్యోతి మంగళవారం జిల్లాకు చేరింది. ర్యాలీకి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ బి. రోహిత్ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, పలువురు క్రీడాకారులు ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి ల్యాండ్ చూపిస్తే అన్ని సౌకర్యాలతో క్రీడా మైదానం నిర్మించేందుకు సహాయం అందిస్తామన్నారు.
సీఎం కప్ ద్వారా ఎంతో మంది గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి రానున్నారని తెలిపారు. ఒలంపిక్స్‌లో తెలంగాణ నుంచి పతకాలు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఎస్పీ రెహమాన్, జిల్లా క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : ర్యాలీకి జూలూరుపాడు మండల కేంద్రంలో ఇన్చార్జి ఎంపీడీవో తాళ్లూరి రవి స్వాగతం పలికారు. యువత సీఎం కప్ లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, జడ్పీ హెచ్ఎస్ హెచ్ఎం లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో...
ఖమ్మం టౌన్ : సీఎం కప్ క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడాజ్యోతి ర్యాలీ మంగళవారం ఖమ్మం జిల్లాకు చేరుకుంది. ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియం వద్ద స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ జెండా ఊపి టార్చ్ రిలే ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు జిల్లా నుంచి ప్రపంచ స్థాయిలో రాణించేలా తయారుకావాలని పిలుపునిచ్చారు.
శివసేనా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్రీడాకారులకు అన్ని సౌకర్యాలతో క్రీడా వసతులు రూపొందించడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీ 16 రోజుల్లో 33 జిల్లాలు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు, యువజన అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, అధికారులు, కోచ్ లు పాల్గొన్నారు.