కేజీబీవీల నిర్వహణలో భాగస్వాములు కండి

కేజీబీవీల నిర్వహణలో భాగస్వాములు కండి
  • రాష్ట్రంలో దేశ్​పాండే ఫౌండేషన్​ సేవలు విస్తరించండి
  • సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి
  • పాలమూరు​ఎన్టీఆర్  మహిళా డిగ్రీ కాలేజీ, ఎంవీఎస్  కాలేజీని దత్తత తీసుకోవాలని సూచన

మహబూబ్​నగర్, వెలుగు : రాష్ట్రంలోని కేజీబీవీల నిర్వహణలో భాగస్వాములు కావాలని దేశ్​పాండే ఫౌండేషన్​ సభ్యులను సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో సంస్థ సేవలు విస్తరించడానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండే ఫౌండేషన్ ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్​లోని సీఎం ఇంట్లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమ సంస్థ అమెరికాతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు,  గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితుల మార్పు కోసం చేపట్టిన కార్యక్రమాలను ఫౌండేషన్​ వ్యవస్థాపకులు సీఎంకు వివరించారు. గవర్నమెంట్​ స్కూళ్లలో చదువుకునే స్టూడెంట్లకు ఇంగ్లీష్​లో ట్రైనింగ్​ ఇవ్వడం, వారిలో నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. 

మహబూబ్​నగర్​ జిల్లాలో బాలికల విద్యాభివృద్ధి కోసం ఎన్టీఆర్  మహిళా డిగ్రీ కాలేజీ, ఎంవీఎస్  డిగ్రీ కాలేజీలను దత్తత తీసుకోవాలని సీఎం సూచించడంతో, వారు అంగీకరించారు. కాగా, మహిళా విద్యాభివృద్ధి, సమగ్ర అధ్యయనం కోసం ఈ నెల 6 నుంచి 8 వరకు కర్నాటక రాష్ట్రం హుబ్లీలో జరిగే కాన్ఫరెన్స్​కు మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి హాజరు కావాలని సీఎం సూచించారు. దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండే ఫౌండేషన్  వ్యవస్థాపకులు గురు రాజ్, జయశ్రీ, రాజు రెడ్డి, జి.అనిల్  సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం..

మహబూబ్​నగర్​ రూరల్ : మన్యంకొండ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం ఎనుముల రేవంత్​రెడ్డికి మహబూబ్​నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన వారిలో మహబూబ్​నగర్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ చైర్మన్​ లక్ష్మణ్​ యాదవ్​, గ్రంథాలయ చైర్మన్​ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ జనరల్​ సెక్రటరీ సిరాజ్​ ఖాద్రి, ఆలయ చైర్మన్​ అళహరి మధుసూదన్, ఈవో శ్రీనివాస్  పాల్గొన్నారు.