ముంబై: మహారాష్ట్రలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీకి 19, శివసేన (షిండే) 11, ఎన్సీపీ (అజిత్)కి 9 మంత్రి పదవులు దక్కాయి. నాగ్‌పూర్‌లోని రాజ్ భవన్ వేదికగా 2024, డిసెంబర్ 15వ తేదీన మంత్రుల ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమం జరిగింది. కొత్తగా ఎంపికైన మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉండగా.. కొత్త మంత్రులకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ షాకింగ్ న్యూస్ చెప్పారు.
ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని.. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తామని చెప్పారు. పని తీరు సరిగ్గా లేని వారికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి కొత్త వారికి మంత్రిగా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ నిబంధన కూటమిలోని మూడు పార్టీలు (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) మంత్రులకు వర్తిస్తోందని చెప్పారు.
ALSO READ | మహా కేబినెట్.. మంత్రులుగా ప్రమాణం చేసింది వీరే
శాఖల కేటాయింపుపై మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని.. మరో రెండు రోజుల్లో మంత్రుల పోర్ట్ ఫోలియోలను ప్రటిస్తామని తెలిపారు. హోం శాఖపై ఇంకా ఎలాంటి నిర్ణయిం తీసుకోలేదని.. అసెంబ్లీ సమావేశాల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో 20 బిల్లులను ఆమోదిస్తామని తెలిపారు. రాష్ట్రంలో డైనమిక్ ప్రభుత్వాన్ని అందిస్తామన్నారు.