నెరవేరని సాగునీటి కల

  • నెరవేరని సాగునీటి కల
  •  ఆందోళనలో గిరిజన రైతులు
  •  నిరుపయోగంగా నిధులు
  •  ఐటీడీఏ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘సీఎం గిరి వికాసం పథకం’ ఆదివాసీ రైతులపాలిట పరిహాసంగా మారింది. సాగునీటి కల నెరవేరక ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. రైతుల పంట భూముల్లో బోర్లు వేసి కరెంట్​కనెక్షన్​ఇవ్వడం మరిచారు. ఇందిర జలప్రభ, సీఎం గిరి వికాసం పేరుతో తెలంగాణ సర్కారు గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించేందుకు ఇచ్చిన నిధులు నిరుపయోగంగా మారాయి. ఈ పథకం కింద రూ.26.15కోట్లను కేటాయించారు. రైతులకు వందశాతం సబ్సిడీతో బోర్వెల్, డ్రిల్లింగ్, విద్యుత్​కనెక్షన్, మోటార్​పంపుసెట్​వంటివి ఏర్పాటు చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీనిలో మొత్తం 2910 మంది రైతులకు 8603.84 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఐటీడీఏ మాత్రం రైతులకు మేలు చేయలేక పోతోంది. అందుకు ఐటీడీఏ ఆఫీసర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మూడేళ్లుగా తప్పని నిరీక్షణ..

దుమ్ముగూడెం మండలం కోయనర్సాపురం గ్రామంలో తెల్లం బొర్రయ్య, ముర్రం రాముడు, బాబు, పాయం ముద్దరాజు, వర్సా రాముడు, ముర్రం భద్రమ్మకు చెందిన భూముల్లో సీఎం గిరివికాసం, ఇందిర జలప్రభ పథకాల కింద భూముల్లో మూడేళ్ల కింద బోర్లు వేశారు. కానీ నేటికీ త్రీఫేజ్​కరెంట్​లైన్​ఏర్పాటు చేయలేదు. ట్రాన్స్ ఫార్మర్లు పెట్టలేదు. బోర్లకు మోటార్లను కూడా అందించలేకపోయారు. దీంతో గిరిజన రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆఫీసర్లు మాత్రం స్పందించడంలేదు. ఇక లాభం లేదనుకుని సొంతంగా బోర్లు వేసుకున్న వర్సా ముద్దరాజు, పాయం రాజు, పాయం చిన్నయ్య, వర్సా కృష్ణమూర్తి, వర్సా వీరస్వామి, పాయం వీరభద్రం, పాయం కొమరయ్య, పాయం సుబ్బయ్య అనే గిరిజన రైతులు త్రీఫేజ్​ కరెంట్ కోసం ట్రాన్స్ కోకు అప్లై చేసుకున్నారు. రూ.6500ల చొప్పున డీడీలు కూడా కట్టారు. కరెంట్​ఆఫీసర్లు కూడా కరుణించక వారి చుట్టూ గిరిజనులు తిరుగుతూనే ఉన్నారు. 

ముందుకు సాగని పథకం..

అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో 15 మంది రైతుల పొలాల్లో బోర్లు వేశారు. 12 బోర్లు అరకొరగా నీళ్లు పోస్తున్నాయి. మరో మూడు బోర్లలో చుక్కనీరు రావడం లేదు. ఇదే విషయాన్ని కాంట్రాక్టర్లకు గిరిజనులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోవడం లేదు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆదివాసీలు తికమకపడుతున్నారు. ఇక బోర్ల డ్రిల్లింగ్, కరెంట్​కనెక్షన్ల విషయంలో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ, ట్రాన్స్ కో ఆఫీసర్లు కొర్రీలు పెడుతున్నారు. దీంతో పథకం ముందుకు సాగలేకపోతోంది. మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లా కారేపల్లిలో గిరి వికాసం పథకం కింద మంజూరైన బోర్లు తవ్వుకునేందుకు అటవీశాఖ సిబ్బంది రూ.30వేల చొప్పున డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది.ఈ బోర్లు, మోటార్లు, కరెంట్ వచ్చేదెప్పుడు..? మా భూములకు సాగునీరు వచ్చేదెప్పుడు..? అంటూ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.

అడిగినా ఇవ్వట్లే...

గిరి వికాసం పథకం అస్తవ్యస్తంగా తయారైంది. మేము యాడాది కిందనే కేశవాపురం, పులిగుండాల గిరిజనులందరం దరఖాస్తు చేసినం. బోర్లు వేసి, కరెంట్ పెట్టి, మోటార్లు ఇచ్చే బాధ్యత ఐటీడీఏదే. కాంట్రాక్టర్లకు అప్పగిస్తే వారు బోర్లు సగం లోతే తవ్వి పైపైన పనులు చేసి పోయిండ్రు. పనులు చూడాల్సిన ఆఫీసర్లు ఆఫీసులు దాటి బయటకు రావట్లే. గిరిజనులకు న్యాయం చేయాలె. - పాయం సత్యనారాయణ, గోండ్వాన సంక్షేమ పరిషత్​రాష్ట్ర అధ్యక్షుడు, కేశవాపురం