వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. - పులివెందుల ఒక విజయగాథ. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్ అని చెప్పారు. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే అని తెలిపారు. గురువారం నాడు పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ వేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల తన ప్రాణమని ప్రతీ కష్టంలో పులివెందుల తన వెంట నడిచిందని చెప్పారు. పులివెందుల అంటే నమ్మకం, అభివృద్ధి, ఒక సక్సెస్ స్టోరీ అని తెలిపారు. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు.. కృష్ణా నది నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధికి కారణంగా వైఎస్సార్ అని అన్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్ వారసులమని కొందరు ప్రజల మందుకు వస్తున్నారని అది వారి కుట్రలో భాగంగా వస్తున్నారని విమర్శించారు.
"వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? నాన్నపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు?. ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు.. వైఎస్సార్ వారసులా? ఆ మహానేతకు వారసులు ఎవరిని చెప్పాల్సింది ప్రజలే. వైఎస్సార్ లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు? వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది ఎవరు?" అని సీఎం జగన్ ప్రశ్నించారు.
పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్ వారసులు అని వైఎస్ షర్మిల పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అవినాష్ ఏ తప్పు చేయలేదని తాను నమ్మాను కాబట్టే.. టికెట్ ఇచ్చానని అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు.