మేనిఫెస్టోను  చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది...సీఎం జగన్ 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనున్న నేపథ్యంలో నేతలంతా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల నేతలకు ఈరోజు ప్రచారం కీలకం కానుంది.ఈ క్రమంలో కైకలూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్ చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. ఇప్పుడున్నట్లు అన్ని పథకాలు ఇంటివద్దకు వచ్చే పరిస్థితి గతంలో ఉండేదా అని అన్నారు.

రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశాడని అన్నారు. ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇచ్చాడా అని ప్రశ్నించారు. మళ్ళీ ఇప్పుడు సాధ్యం కానీ హామీలతో మీ ముందుకు వచ్చిన చంద్రబాబును నమ్మొద్దని అన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన ముగ్గురూ మళ్ళీ ఇప్పుడు కూటమిగా వచ్చారని అన్నారు. మళ్ళీ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పథకాలు రావాలన్నా, అవ్వాతాతలకు పెన్షన్ రావాలన్నా, పిల్లల బతుకులు బాగుపడాలన్నా ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని అన్నారు.