
ఏపీ అవతరణ వేడుకల్లో సీఎం జగన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని కలలో కూడా ఊహించలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 1953 నుంచి విడిపోతూ చివరికి విభజిత ఆంధ్రాగా మిగిలిపోయిందన్నారు. 60 ఏళ్ల కష్టార్జితమంతా చెన్నై, హైదరాబాద్ లో వదిలేసి రావాల్సి వచ్చిందన్నారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో కలిసి జగన్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబసభ్యులు, బంధువులను సత్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ హయాం ముగిశాకే ఉమ్మడి ఏపీలో ఊహించని పరిణామాలు జరిగాయన్నారు. 29 రాష్ట్రాల్లో ఏపీ దగా పడినంతగా ఏ రాష్ట్రమూ పడలేదన్నారు. చెప్పిన మాట ప్రకారం నవంబర్ 1వ తేదీనే ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిదని జగన్ అన్నారు.