ఏపీలో ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో పాటు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానుంది. ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉంటుంది.ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన తర్వాత 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
ప్రస్తుతం మేమంతా సిద్ధం సభలతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జగన్ ఏప్రిల్ 24న ఇచ్ఛాపురంలో చివరి సభ ముగించుకొని పులివెందుల చేరుకోనున్నారు. 25న నామినేషన్ వేసిన తర్వాత పులివెందులలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు జగన్. ఈ నెల 22న జగన్ తరఫున కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత ఎన్నికల్లో జగన్ 90వేల భారీ మెజార్టీతో గెలుపొందగా ఈ ఎన్నికల్లో అంతకు మించిన మెజార్టీతో గెలుపొందాలని వైసీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.